11-10-2025 12:00:00 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో స్పీడ్ బ్రేకర్‌లు పెద్ద సమస్యగా మారాయి. ప్రమాదాల నివారణకు, వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లు అవసరమే. అయితే చాలా చోట్ల అవసరం లేని స్పీడ్ బ్రేకర్లే ఎక్కువగా ఉన్నాయి. అవి ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఈ మధ్య సిటీ ఇన్నర్ రోడ్లలో వంద, రెండు వందల మీటర్ల దూరంలోనే నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఉంటున్నాయి. బస్తీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
నాలుగు ఇండ్లకో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఎత్తున స్పీడ్ బ్రేకర్ల వల్ల వేగం నియంత్రణ అటుంచితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా నిర్మించిన స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనాలు దెబ్బతినడం, సిటీలో రెగ్యులర్‌గా ప్రయాణం చేసే వాహనదారుల్లో కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీల రోడ్లపై జీబ్రా స్పీడ్ బ్రేకర్లు ఐదు నుంచి పది లైన్లతో నిర్మిస్తున్నారు. వీటిని ఒకలైన్ ఒక సెంటీమీటర్ ఎత్తులో నిర్మించవలసి ఉంటుంది. కానీ రెండు మూడు ఇంచుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
తక్షణమే జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనుమతి లేని అక్రమ స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలి. అనుమతి ఉన్న స్పీడ్ బ్రేకర్లకు రేడియం కలర్ వేయడం తప్పనిసరిగా చేయాలి. అక్రమంగా స్పీడ్ బ్రేకర్స్ నిర్మించేవారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే భారీ జరిమానా విధించాలి.
శ్రీనివాస్, మల్కాజ్ గిరి