calender_icon.png 12 July, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం

12-07-2025 02:06:59 AM

  1. ప్రతి మండలానికి 4 నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లు 

ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవోను నియమిస్తాం 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సామాన్యులకు భూ సమస్యలపై మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు వరకు లైసెన్స్‌డు సర్వేయర్లు, ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవోను నియమించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శిక్షణ పొందిన లైసెన్స్‌డు సర్వేయర్లకు ఈ నెల 27న తుది పరీక్ష నిర్వహించి ఆగస్టు 12న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రెవెన్యూ అధికారులతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు అప్రెంటీస్ శిక్షణ ఉంటుందన్నారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయం లో సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడంతో సర్వేయర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

లైసెన్స్‌డు సర్వేయర్ల కోసం 10 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని ఇందులో తొలి విడతలో 7 వేల మందికి శిక్షణ పూర్తి కావస్తుందని, రెండో విడతలో మిగిలిన 3 వేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామన్నారు. వీఆర్వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారని తెలిపారు.

రెవెన్యూ సంఘాల వినతిమేరకు ఈ నెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని నక్షలేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే విజయవంతమైందని తెలిపారు. మిగిలి గ్రామాల్లోనూ రీ సర్వే నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.