calender_icon.png 12 July, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు భూమిలో అక్రమ వెంచర్!

12-07-2025 01:02:01 AM

  1. శ్రీరిధి డెవలపర్‌లో అక్రమాలు 
  2. నాలాను మింగిన ఘనులు
  3. అక్రమార్కులకు అండగా ఇరిగేషన్ అధికారులు
  4. అనుమతి లేకుండానే ప్రహారీ గోడ నిర్మాణం
  5. ఫైనల్ లేఅవుట్ రాకుండానే ప్లాట్ల అమ్మకాలు
  6. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
  7. గతంలో హెచ్చరించినా ఆగని నిర్మాణాలు

కొండాపూర్, జులై 11 : అధికారుల అండదండలతో అక్రమార్కులు ఇష్టారీతిగా వెంచర్లను ఏర్పాటు చేయడమే కాకుండా నాలాను కబ్జా చేసి అక్రమ ప్రహారీ గోడను నిర్మిస్తున్నారు..గతంలో ప్రహారీ గోడను కూల్చివేసినప్పటికీ మళ్ళీ నిర్మాణం చేపట్టడం వెనుక అధికారుల హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామంలో అనుమతులు లేకుండానే శ్రీరిధి హాబిటేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ డెవలపర్స్ వెంచర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

సర్వే నంబర్లు 194, 196, 16, 92లలో గేటెడ్ కమ్యూనిటీగా ప్రహరీ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపడుతున్నారు. ఈ భూముల్లో పలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా మునిదేవునిపల్లి సర్వే నెంబర్ 92 ప్రభుత్వ భూమిలో నుండి రాత్రిపూట జేసీబీ, టిప్పర్ల సహాయంతో వెంచర్లో ఉన్న రోడ్ల నిర్మా ణం కొరకు అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. పెద్దగుట్ట కింద ఉన్న పెద్దవాగును కబ్జా చేసి అందులో ప్రహరీ గోడ నిర్మాణాలు జరుగుతున్నాయి.

మనసాన్ పల్లి గ్రామం నుండి పెద్దవాగులోకి వెళ్లే నాలా సంవత్సరం క్రితం 12 ఫీట్లు ఉండగా ప్రస్తుతం దాన్ని పూడ్చివేసి మూడు ఫీట్లకు మార్చారు. ఇరిగేషన్ అధికారులకు ఆధారాలతో సహా సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92లో భారీ ప్రహరీ గోడ నిర్మించారు. నాలాల కబ్జా, నీటి ట్యాంకుల నిర్మాణం మొదలైన పనులు చేపడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

గ్రామ పరిధిలోని రైతుల పొలాలకు వెళ్లే మార్గాలను కూడా మూసివేయడం వల్ల స్థానిక రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంచర్కు సంబంధించి ఫైనల్ లేఔట్ అనుమతి రాకముందే ఆకర్షణీయంగా రంగురంగుల బ్రోచర్లు ముద్రించి రోడ్లపై కరపత్రాలు పట్టుకొని ప్లాట్లు అమ్మే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అధికార అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అధికారులు హెచ్చరించిన ఆగని అక్రమాలు...

గతంలో ఇలాంటి అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో అధికారులు కూల్చివేతలు జరిపి మళ్లీ అక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని డీఎల్పీవో అనిత హెచ్చరించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా అక్రమార్కులు తమ పంథాను మార్చుకోవడం లేదు. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై వివరాల కోసం మునిదేవునిపల్లి కార్యదర్శికి ఫోన్ చేస్తే కనీసం స్పందించక పోవడం గమనార్హం.  

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే కఠిన చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా, అక్రమంగా మట్టి తరలించినా కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీరిధి వెంచ్ప తమకు ఫిర్యాదులు అందలేదని, విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు నష్టం కలిగించే విధమైన అక్రమ ప్రాజెక్టులపై ఉక్కుపాదం మోపుతాం.

అశోక్ , తహసీల్దార్, కొండాపూర్