12-07-2025 01:53:46 AM
అవార్డులకు ఎంపికైన గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఆసుపత్రులు
మరోసారి రెండో స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించిన గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
గజ్వేల్, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డులలో సిద్దిపేట జిల్లాకు చక్కని గుర్తింపు లభించింది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు రాష్ట్రస్థాయిలో కాయకల్ప అవార్డుల పోటీ నిర్వహించగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలువగా, గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రెండవ స్థానంలో నిలిచింది.
జిల్లా నుండి గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నంగునూరు, చేర్యాల ఏరియా ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు పోటీపడ్డాయి. వీటిలో గజ్వేల్ ఏరియా ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచి రూ. 10 లక్షల కాయకల్ప నగదు అవార్డు గెలుచుకుంది.
ఆసుపత్రుల నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, వైద్య సేవల పెంపు, పరిశుభ్రత, బయో వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో మేలైన సేవలను పెంపొందింప చేయడానికి స్వచ్ఛభారత్ లో భాగంగా కాయకల్ప అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం నగదు అవార్డులను జిల్లా ఆరోగ్య సొసైటీలకు అందిస్తుంది.
జిల్లాలో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో రెండవ బహుమతి రూ. 10 లక్షలు, దుబ్బాక ఏరియా ఆసుపత్రికి ప్రోత్సాహక బహుమతి రూ. లక్ష, ఈకో ఫ్రెండ్లీ అవార్డు కింద మరో రూ. 5 లక్షలు నగదు అవార్డు లభించింది. అలాగే హుస్నాబాద్ ఏరియా ఆసుపత్రికి ప్రోత్సాహక బహుమతి కింద రూ. లక్ష నగదు అవార్డు లభించిందని గజ్వేల్ ఏరియా సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు.
జిల్లాలో మూడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు కాయకల్ప అవార్డులు సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలకు ఈ అవార్డులే ఉదాహరణగా నిలిచాయన్నారు. కాయకల్ప అవార్డుల ప్రోత్సాహంతో జిల్లాలో ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు.