12-07-2025 01:33:57 AM
* వానాకాలం సీజన్ మొదలైంది.. రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరి నాట్లతో పాటు ఇతర పంటల సాగును రైతులు ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో సాగుకు సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా, రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. యూరియా కోసం ఎరువుల షాపుల ముందు వ్యవసాయ పనులు వదిలేసి రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చునే పరిస్థితి కనిపిస్తోంది.
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : కేంద్రం నుంచి ఈ వానాకాలం సీజన్‌కు (జూలై వరకు) 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఇందులో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి కేంద్ర ప్రభు త్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను కేటాయించినా కేవలం 3.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసింది. దీంతో ఈ మూడునెలలకు సంబంధించి 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం కోత పెట్టింది.
అంటే ఈ జూలై నెలతో కలిపి రాష్ట్రానికి ఇంకా 2.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో సుమారుగా ఇంకా 50 శాతం వరకు రావాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో యూరియాకు ఎక్కువ డిమాం డ్ ఉండటం, నిల్వ తక్కువగా ఉండటంతో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యారియాను రైతులకు పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తున్నారు.
కొన్ని చోట్ల ఎకరాకు ఒక బస్తా యూరియా చొ ప్పున ఇస్తుండగా, మరికొన్ని చోట్ల ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నప్పటికి మూడు, నాలు గు బస్తాలకు మించి ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం ప్రయ త్నాలు చేస్తూనే.. ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన యూరియాను ఆయా జిల్లాలలో సాగు విస్తీర్ణం బట్టి సంబంధిత అధికారులు సరఫరా చేస్తున్నారు.
ఇటీవలనే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియాను కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నం చేస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు..
ఇదిలా ఉండగా, తెలంగాణలో యూరి యా దొరక్క పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు రాష్ట్రానికి వచ్చిన యూరియాను కొందరు డీలర్లు, అధికారులు కలిసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ సహకార సం ఘాల్లో ఉండాల్సిన యూరియా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న యూరియాను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు సబ్సీడిపై ఇవ్వాల్సిన 150 బస్తాల యూరియాను రెండు లారీల్లో బ్లాక్ మార్కెట్‌కు ద్వారా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్ తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని ఒక వైపు సర్కార్ హెచ్చరిస్తున్నా అధికారులు, డీలర్లు ఏమాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కో యూరియా బస్తాను ప్రభత్వం నిర్ణయించిన ధర ప్రకారం అన్ని ఖర్చులతో కలిపి రూ. 266 లకు విక్రయించాలి, కానీ ఎరువుల డీలర్లు మాత్రం కొరతను అసరగా చేసుకుని ఆదిలాబాద్‌తో పాటు మరికొన్ని చోట్లు రూ. 100 నుంచి రూ. 150 వరకు అదనంగా వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం గట్టి నిఘా పెట్టి యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపైన, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుమ్రంభీం జిల్లాలో పడిగాపులు
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో 4.45 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వివిధ పంటల సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా 3.35 లక్ష ఎకరాల పత్తి పంట సాగు అయ్యే అవకాశం ఉంది. 55 వేల ఎకరాల వరి, 32 వేల ఎకరాల కంది పంట సాగు చేయనున్నారు.
6 వేల ఎకరాలలో పెసర, సోయాబీన్, మిర్చి ఇతర చిరుధాన్యాలు సాగు చేయనున్నారు. జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా కేవలం 25 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటివరకు వచ్చింది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు 45 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 18 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే వచ్చాయి. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న రైతులు మరోపక్క ఎరువుల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎకరానికి ఒక్కో బస్తా యూరియా ఇస్తున్నప్పటికీ అది కూడా వారం, రెండు వారాలకు ఓసారి ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సిర్పూర్ టి, రెబ్బెన, చింతలమానపల్లి, వాంకిడి, జైనూర్ మండలాల్లో ఎరువుల కోసం రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఎరువుల పంపిణీలో ప్రైవేట్ వ్యాపారులతో సహకార సంఘాలు, అధికారులు చేతులు కలిపారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో రైతుల పాట్లు
నిర్మల్(విజయక్రాంతి): పంటలు సాగుచేసిన రైతులకు నిర్మల్ జిల్లాలో యూరియా కృత్రిమ కొరత వేధిస్తున్నది. జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా.. అందులో పత్తి, సోయా, మొక్కజొన్న, వరి పంటలు ప్రధానంగా ఉన్నాయి. రైతులు కలుపు తీసి రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. మొక్కలు ఎదుగుదలకు నత్రజని ఎరువులు తప్పనిసరి కావడంతో ఎరువుల దుకాణంలో యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వం జూన్, జూలై కోటాలో యూరియా కొరత విధించడంతో జిల్లాకు డిమాండ్‌కు తగ్గ యూరియా సరఫరా కాలేదు. బైంసా డివిజన్‌లోని తానూర్, కుబీర్, బుధోల్, బాసర, కుంటాల, నరసాపూర్ మండలాల్లో యూరియా దొరకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాలకు, ఆగ్రో ఏజెన్సీలకు, డీసీఎంఎస్ కేంద్రాలకు యూరియాను కేటాయిస్తున్నప్పటికీ భవిష్యత్తులో భయంతో రైతులు ముందుగానే నిలువలు పెంచుకోవడానికి పోటీపడుతున్నారు. అందువల్లనే యూరియా కొరత ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో బారులు
భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతులు ప్రాథమిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. జిల్లాలో 1,60,956 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,04,632 ఎకరాల్లో పత్తి, 86 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
అధికారుల ప్రణాళిక ప్రకారం వానాకాలం వివిధ రకాల పంటలకు 40, 625 మెట్రిక్ టన్నుల యూరియా, 10, 978 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,961 మెట్రో టన్నుల ఎంవోపీ, 47,586 మెట్రోలో ఎన్పీకేఎస్, 4,457 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఆ మేరకు జిల్లాకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దశల వారీగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
ఆ రకంగా జూలైలో యూరియా 13, 655 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 11,651 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా అయింది. ఇప్పటికే రైతుల వద్దకు 4,151 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా.. ఇంకా 7500 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయానికి సిద్ధంగా ఉంది. ఇంకా 2,003 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావలసి ఉంది.
యూరియా కొరత ఏర్పడుతుందని జరుగుతున్న ప్రచారానికి భయాందోళన చెందిన రైతులు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. రావలసిన యూరియాకు ఇంకా 20 రోజుల వరకు సమయం ఉంది. అయినా కూడా రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండు వారాలకు మూడు బస్తాలు తీసుకున్నా
నాకు మూడు ఎ కరాల భూమి ఉన్న ది. అందులో పత్తి పంట వేశాను. యూ రియా కోసం పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఇచ్చి అధికారుల వద్ద రెండు వారాల క్రితం వెళ్తే మూడు బస్తాలు రాశారు. శుక్రవారమే బస్తాలు తీసుకునేందుకు అవకాశం వ చ్చింది. సమయానికి ఎరువులు వేయకపోతే దిగుబడి రాదన్న ఆందోళన ఓ పక్క ఉంటే మరో పక్క ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతున్నాం. అధి కారులు, ప్రభుత్వం స్పందించి సరిప డా ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలి.
కుర్సింగా లక్ష్మణ్, మాలన్ గొంది, ఆసిఫాబాద్