27-09-2025 01:04:13 AM
750 గ్రాముల గంజాయి, నగదు, ఆటో స్వాధీనం: సిఐ కే శశిధర్ రెడ్డి
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి, వారి నుండి రూ.15,000 విలువగల 750 గ్రాముల గంజాయి, రూ.వెయ్యి నగదు, ఆటో, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సిఐ కార్యాలయంలో ఎస్ఐ రాజశేఖర్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామగుండం టాస్క్ ఫోర్స్ టీం, పట్టణ పోలీసులు శుక్రవారం పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద గల రెస్ట్ ఏరియాలో నిఘా ఏర్పాటు చేయగా, కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఈజ్ గావ్ గ్రామానికి చెందిన గంజాయి విక్రయ దారుడు తరుణ్ సర్కార్, మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ కు చెందిన షేక్ అజీజ్, వనం సాయికృష్ణ అను ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ ఉండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
విచారణలో వారు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తరుణ్ సర్కార్ ఒడిస్సా నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, మంచిర్యాల ప్రాంతంలోని యువకులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు నేరం అంగీకరించారన్నారు. నిందితుల నుండి రూ.15000 విలువ గల 750 గ్రాముల గంజాయి, రూ.వెయ్యి నగదు, ఆటో, మూడు స్మార్ట్ ఫోన్లు లను స్వాధీనం చేసుకొని, వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముగ్గురు నిందితులలో తరుణ్ సర్కార్, షేక్ అజీజ్ లపై గతంలో గంజాయి కేసులు ఉన్నాయని, ముగ్గురు నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.