calender_icon.png 14 August, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ పాఠశాలలో దేశభక్తి ఉత్సాహం

13-08-2025 10:05:53 PM

ఫ్యాన్సీ దుస్తుల పోటీ ఆకట్టుకున్న చిన్నారులు..

సనత్‌నగర్ (విజయక్రాంతి): స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ నారాయణ పాఠశాల ఆవరణలో బుధవారం రోజు దేశభక్తి సందడి నెలకొంది. ప్రాథమిక తరగతుల చిన్నారులు దేశభక్తి ఫ్యాన్సీ దుస్తుల పోటీలో భాగంగా జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల వేషధారణలో వేదికపై అడుగుపెట్టారు. పసి వయస్సులోనే వీరు ధైర్యం, త్యాగం, సేవలతో నిలిచిన మహానుభావుల రూపాలు ధరించడం చూడటానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతమాత ఆరాధనలో కాంతివంతమైన చీర కట్టుకున్న చిన్నారి నుండి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దుస్తులలో సాంఘిక న్యాయం సందేశం అందించిన విద్యార్థి వరకు, ఝాన్సీ లక్ష్మీబాయి ఖడ్గం పట్టిన వీరనారి రూపంలో వేదికపై గర్జించిన బాలిక వరకు ప్రతి ఒక్కరి ప్రదర్శన ప్రేక్షకులలో చప్పట్ల వర్షం కురిపించింది.

స్వామి వివేకానంద వేషధారణలో ఒక విద్యార్థి “ఉత్తిష్టత జాగ్రత” అని గర్జించగా, జవహర్‌లాల్ నెహ్రూ పాత్రలో ఒక చిన్నారి పిల్లలకు తన మమకారం వ్యక్తం చేసింది. ప్రతి ప్రదర్శనలోనూ దేశ చరిత్ర, స్వాతంత్ర్య సంగ్రామం, మహనీయుల త్యాగాల స్ఫూర్తి ప్రతిఫలించింది. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసిన అనంతరం ప్రిన్సిపల్ నూరిన్ ఫాతిమా మాట్లాడుతూ, “ఇలాంటి పోటీలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, మన దేశం యొక్క గాథ, సంస్కృతి, మహనీయుల త్యాగాలు తెలుసుకునే విలువైన అవకాశాన్ని ఇస్తాయి” అన్నారు.ఈ కార్యక్రమంలో జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొని పిల్లలను ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణలో అలరారిన ఈ దేశభక్తి వాతావరణం స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మరింత రంగులు అద్దింది.