calender_icon.png 24 August, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ప్రజల పట్ల శ్రద్ధ తీసుకోవాలి

23-08-2025 08:24:22 PM

చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ప్రజల పట్ల శ్రద్ధ తీసుకోవాలని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో చెత్తను తరలించే వాహనాలు, డ్రైనేజీ శుభ్రపరిచే సిబ్బంది, దోమల నివారణకు స్ప్రేలు, మందులు అందుబాటులో ఉంచేవాళ్లమని తెలిపారు.

సీజనల్ వ్యాధులు వస్తే ముందే అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించేవాళ్లమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చేదని, శానిటేషన్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని అన్నారు. నేడు రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులను గాలికి వదిలేసి అధికారం దాహాన్ని తీర్చుకుంటుందని మండిపడ్డారు. చెత్త కుప్పలు తొలగించకపోవడం వల్ల ప్రతి వీధి దుర్వాసనతో నిండిపోయిందని తెలిపారు. అధికార పార్టీ  పదవుల పంచాయితీలు, వర్గపోరాటాలకే ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.