23-08-2025 08:25:40 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అంశాలపై ఆరా తీశారు. తదుపరీ విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఏమి అవ్వాలో నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో మార్చుకోకూడదని, అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గమ్యాన్ని చేరేంతవరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు.
ప్రస్తుతం సమాజంలో డిమాండ్ ఏ రంగంలో ఉందో తెలుసుకోని, అనుభవం ఉన్న వారి సలహా తీసుకోని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఐటీ, మెడికల్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, టీచర్ బిజినెస్, సిఏ, వంటి ఏ రంగాల్లో ఇష్టమో, ఏ రంగంలో ప్రతిభ ఉందో గుర్తించి ఆదిశగా అడుగులు వేయాలని అన్నారు. వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల, సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈయన వెంట బిసి వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్సిఒ స్వప్న, డిసిఒ లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.