20-09-2025 12:00:00 AM
-పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు
-పార్టీ మారలేదని ఇప్పటికే 8మంది సభ్యుల వివరణ
-ఇంకా సమయం కావాలన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): పార్టీ మారినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ మరోమారు నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరిన్ని ఆధారాలు కావాలంటూ శుక్రవారం స్పీకర్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని ఆ పార్టీకి చెందిన నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచన మేరకు పార్టీ మారిన పది ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు సమయం కావాలని కోరారు. ఇప్పుడు స్పీకర్ ప్రసాద్‌కుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, శేరిలింగంపలి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మినహా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు.