25-12-2025 01:36:27 AM
రూ. 650 కోట్లలో ఇచ్చింది పదిశాతమే!
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల (పెన్షనర్లు) వెత లు అన్నీ ఇన్నీ కావు. తమ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాక తీవ్ర ఆవేదనలో రిటైరైన ఉద్యోగులున్నారు. ఇదిగో అదిగో అంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదే తప్ప రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు అం దలేదని వారు వాపోతున్నారు. బెనిఫిట్స్ ను ఇవ్వాలని కోరితే ఎన్నికలున్నాయి.. త ర్వాత చూద్దామనే సమాధానాలు చెబు తూ ప్రభుత్వ పెద్దలు దాటవేస్తున్నారని ఆ వేదన వ్యక్తంచేస్తున్నారు.
బెనిఫిట్స్ అంద క.. వైద్య ఖర్చులకూ డబ్బుల్లేక పలువురు తనువుచాలిస్తుంటే, మరికొందరు మంచానికే పరమితమవుతున్నారు. పిల్లల పెళ్లి చేయలేక నరకయాతన పడుతున్నారు. తీసుకున్న అప్పులకు, లోన్‌లకు ఈఎంఐలు, అసలు, వడ్డీలు కట్టలేక జీవనమజిలి చివరి అంకంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈక్రమంలోనే తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షా కార్యక్రమాన్ని చేపట్టింది. జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగులు అంతా కలిసి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాలో పాల్గొనగా, మిగతా అన్ని జిల్లాల్లో వారు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇప్పటివరకు 33 మంది చనిపోయారు..
ఉద్యోగ విరమణ (రిటైర్‌మెంట్) పొందాక జీవితకాలం దాచుకున్న డబ్బు వస్తుందనుకొని తెలిసిన వాళ్లు, బంధువులు, ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న దానికి వడ్డీ, ఈఎంఐలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏదైనా అనారోగ్యం బారినపడితే వైద్య ఖర్చు లక్షల్లో అవుతోంది. ఈహెచ్‌ఎస్ స్కీం సరిగా అమలుకాకపోవడంతో లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమతలేక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 33 మంది చనిపోగా, నలుగురు మిస్సింగ్ (మనోవేదనతో) అయ్యారు.
మరో 16 మంది లేవకుండా మంచానికే పరిమితమయ్యారని జేఏసీ నాయకులు చెప్తున్నారు. తమ బెనిఫిట్స్‌పై ప్రభుత్వం పలుమార్లు సమీక్ష చేసినా.. సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదని అంటున్నారు. తాము ప్రాణాపాయస్థితిలో ఉంటన్నామని తమ బెనిఫిట్స్ తమకు ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగులు వీడియోలను సైతం పోస్టు చేస్తున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చలనం లేకుండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రావాల్సింది 25 లక్షల నుంచి 80 లక్షలు..
ఆర్థిక భారంతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దాంతో 2024 మార్చి 31 వరకు ఉద్యోగుల రిటైర్‌మెంట్‌లు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది రిటైరైన వారున్నారు. ఇక 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది, 2028లో 7,213 మంది పదవీ విరమణ చేయనున్నారు.
2024 ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్నవారికి ప్రభుత్వం బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులు స్థాయిని బట్టి ఒక్కోక్కరికి కనీసం రూ. 25 లక్షల నుంచి అత్యధికంగా రూ. 80 లక్షల వరకు రావాల్సి ఉంది. ఇందులో జీపీఎఫ్ కింద ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు, గ్రాట్యూటీ కింద రూ.1 6 లక్షల వరకు, లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 3 నుంచి 5 లక్షలు, కమ్యూటేషన్ కింద రూ. 7 లక్షల నుంచి రూ. 15 లక్షలు, టీజీఎల్‌ఐ కింద రూ. 5లక్షల వరకు, జీఐఎస్ కింద రూ. 20 వేల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉంటుంది.
585 కోట్లు ఒకేసారి ఇవ్వాలి..
ముప్పు ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులకు రిటైర్‌మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పెంచిన ఉద్యోగ విరమణ వయసు వల్ల నిలిచిపోయిన రిటైర్మెంట్లు 2024 మార్చి 31తో ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి రాష్ర్టవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది రిటైర్ అయినవారున్నారు. వీరంతా పదవీ విరమణ పొంది 20 నెలలు అవుతున్నా బెనిఫిట్స్ మాత్రం అందడంలేదు.
వీరందరికీ గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్‌ఐ, కమ్యూటేషన్, జీఐఎస్ లాంటి బెనిఫిట్స్ కింద దాదాపు రూ. 650 కోట్లు రావాల్సి ఉంది. అయితే వీరికి ఇప్పటివరకు ఇందులో 10 శాతం అంటే బకాయిలే విడుదల చేశారు. ఇంకా రూ.585 కోట్లను పెండింగ్‌లోనే ప్రభుత్వం పెట్టింది. వీటిని ఇన్‌స్టాల్‌మెంట్లలో కాకుండా ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా రిటైర్ అయిన ఉద్యోగులు పనిచేసినకాలంలో జమ చేసుకున్న జీపీఎఫ్‌తో పాటు, ఇతర ప్రయోజనాలు అన్నింటినీ కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం నుంచే ఈ విధానం అటకెక్కింది.
బెనిఫిట్స్ ఇవ్వండంటే సర్పంచ్ ఎన్నికలన్నారు..
33 జిల్లాల్లో ఒకరోజు నిరాహార దీక్ష ను చేపట్టాం. పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లులు విడుదల చేయాలని కోరితే సర్పంచ్ ఎన్నికలున్నాయని ఆగాలని మొన్నటిదాక అన్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి. మరీ మా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తారు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కాకుండా ఒకేసారి మొత్తం విడుద ల చేయాలి. బెనిఫిట్స్ విడుదల చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఏమాత్రం మా సమస్యపై స్పందించడంలేదు. ఇప్పటివరకు కేవలం రూ. 65 కోట్లే విడుదల చేసింది. మిగిలిన రూ.585 కోట్ల ను ఒకేసారి విడుదల చేయాలి. రిటైర్ అయిన ఉద్యోగులు ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈవారంలో మా భవిష్య త్ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుంది.
కే లక్ష్మయ్య,
ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ చైర్మన్