calender_icon.png 25 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీమే సవాల్

25-12-2025 01:44:04 AM

కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వ.. ఇదే నా శపథం 

  1. చిన్న పంచాయతీలకు 5లక్షలు.. మేజర్ పంచాయతీలకు 10 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులు 
  2. వివక్ష చూపితే అభివృద్ధికి ఆటంకం 
  3. కోస్గిలో సర్పంచులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి 

* మా సర్పంచ్‌ల దగ్గరికి రా.. చింతకమడకలో చీరి చింతకు కడతారు.

* జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు తిండి పెట్టడం ఎందుకని ఒక్క కేసు కూడా పెట్టకుండా వదిలేశాను. 

భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ చరిత్ర ఖతమే. 

* మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్, కేసీఆర్ గతమే.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ. గత చరిత్రతో ఒరిగేదేమీ లేదు. 

* నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వ. ఇదే నా శపథం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు అయితే.. 2/3 వంతు మెజార్టీతో 8౭కి పైగా సీట్లతో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఒకవేళ 153 సీట్లయితే.. 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రాసి పెట్టుకోండి.. ఇదే నా సవాల్. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషంలాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా.  

- సీఎం రేవంత్‌రెడ్డి

నారాయణపేట, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : నూతన సం వత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తా మని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పంచాయతీలకు యథా విధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ. 10లక్షలు చొప్పున ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు  (ఎస్‌డీఎఫ్) కేటాయిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాన్నారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు ఇవి అదనం.  ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోకపోవచ్చు.  కొత్త సర్పంచుల గౌరవం నిలబెట్టేందుకే ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరుచేస్తున్నాం. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి  చెప్పారు. బుధవారం కోస్గి పట్టణం.. కొడంగల్ నియోజకవర్గంలో నూత నంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 182 మంది కొత్త సర్పంచులను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి తోలు తీస్తానంటున్నారు. కేసీఆర్‌వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మొదలుపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టా. నేను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారు.. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్‌ను కేసీఆర్ బందీఖానాగా మార్చుకున్నారు. చుట్టూ పోలీసులున్నారు. చర్లపల్లికై నా, చంచెల్‌గూడ జైలు కు పంపినా అదే పరిస్థితి ఉంటుంది కదా.

నన్ను గెలకవద్దు.. మర్యాదగా ఉండదని మా ట్లాడటం లేదు. తోలు తీస్తామంటారా..  రెండే ళ్లు ఫాంహౌస్‌లో అదే పనిచేశారా?.. మా సర్ప ంచ్‌ల దగ్గరికి రా.. ఎవరి తోలు తీస్తారో చూ ద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. కేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ్ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతా రా?.. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు.

జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు తిండి పెట్టడం ఎందుకని నేను ఒక్క కేసు కూ డా పెట్టకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు సోయిలేకుండా మాట్లాడుతూ తోలుతీస్తా అని స్థాయిలేని మాటలు మాట్లాడుతున్నారు’. అని ధ్వజమెత్తారు. ‘నీ చింతమడకకు రమ్మంటావా లేక కొడంగల్ వస్తావా? ఎక్కడైనా తేల్చుకుం దాం. మటన్ కొట్టు మస్తాన్ దగ్గర పొట్టేలును కోసిన తర్వాత తోలుతీసే పని కేసీఆర్‌కు ఇమ్మని చెప్పాను. సాయంత్రం వెళ్లేటప్పుడు దావత్ కోసం ముక్కో బొక్కో ఇచ్చి పంపమని సూచించాను. నన్ను గెలికితే నేను మాట్లాడటం మొదలుపెడితే నువ్వు ఉరి వేసుకుని చస్తావు’.అని రేవంత్‌రెడ్డి ఆగ్రహంగా అన్నారు. 

రాజకీయాలకు తావు లేదు 

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఇక రాజకీయాలు లేవు, పార్టీలు, పంతాలు వద్దు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగిశాయని, రాజకీయాలకు తావు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అవి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెం దుతుందని, వివక్ష చూపితే అభివృద్ధికి ఆట ంకం ఏర్పడుతుందని అన్నారు. ‘తెలంగాణలోనే కోడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెట్టాలి.  నేను ఎక్కడున్నా.. నిరంతరం మిమ్మల్ని గమనిస్తుంటాను.

నా సోదరుడిని ప్రత్యేకంగా మీసమస్యలు తీర్చేందుకే ఎలాంటి పదవి లేకుండా నియోజకవర్గంలో అందుబాటులో ఉంచాను. 2009లో ఇక్కడి నుంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి  రాష్ట్రానికి సీఎం అయ్యాను. కోడంగల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్‌లలో చాలామంది సమస్యలు చెప్పాలని ఆశతో ఉ న్నారు. నిధులు మంజూరైన చేయాల్సిన అభివృద్ధి ఉంది. 

ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామికవాడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకుందాం.  2023 డిసెంబరు లో వచ్చిన ప్రజా ప్రభుత్వం  రెండే ళ్లు పూర్తి చేసుకుంది.  అధికారంలోకి వచ్చి పదేళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3 కోట్ల 10 మందికి  సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంకా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇచ్చి  ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే బాధ్యత నాది.

కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో రేషన్ కార్డులు , ఉచిత కరెంటు లేని , రైతు భరోసా రాని రైతుల పేర్లు రాసుకుని ఇస్తే అర్హులైన అందరికీ ఆయా పథకాలను అందిస్తాం. బస్సుల్లో మహిళలకు కండక్టర్ బస్ చార్జీ అడిగితే నా పేరు చెప్పండి. మా అన్న సీఎం కు చెప్తాం. మీ నౌకరి ఊడుతుంది అని చెప్పండి. కోటిమంది  ఆడ బిడ్డ లకు సారే  పేరిట చీర ఇస్తునాం. ఇంకా ఎవరికైనా చీర అందక పోతే ఇవ్వాలని  అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన వేదిక మీద నుంచి సీఎస్, కలెక్టర్లను ఆదేశించారు.

కొడంగల్ నియోజకవర్గంలో 25వేల మంది ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడు తున్నాం.  రాష్ట్ర మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఇలాగే టిఫిన్ మధ్యాహ్న భోజనం పెట్టి మంచి చదువు చెప్పిస్తాం. ఇప్పుడు ఉమ్మ డి జిల్లా ప్రాజెక్టులతో పాటు పాలమూరు రం గారెడ్డి  ఎత్తిపోతల పనులు చేసుకుంటున్నాo.  2014లో తెచ్చిన జీవో 69 ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టింది. చివరకు ఆ ప్రాజెక్టు సాధన సమితి ఏర్పాటు చేసి గొంతెత్తి నినదించింది.

ఇప్పుడు తాము ఆ ప్రాజెక్టును ప్రారంభించు కుంటుంటే  కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారు. మక్తల్ నారా యణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవ డం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరా కు 18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే తాను ఎకరాకు 20 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకు న్నానని క్యాబినెట్ ఆమోదం పొందింది’ అని  సీఎం తెలిపారు.  ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా సర్పంచులను స్వయాన సీఎం సన్మానించడాన్ని చూడలేదు అన్నారు.

రాష్ట్రంలో 70 శాతం సర్పంచ్‌లను గెలిశాం. ఇది మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి శుభసూచకం అన్నారు. ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలతో సస్యశ్యామలం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, నారాయణపేట ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వర్, రెవెన్యూ కలెక్టర్ శ్రీను, కాడ అధికారి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా డీఎస్పీలు, కొడంగల్ నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

తెలంగాణ గురించి ఏం తెలుసు? 

‘స్థిరాస్తి వ్యాపారం దందా చేస్తున్నానని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదేం పాస్‌పోర్టు బ్రోకర్ వ్యవహారం కాదు. దుబాయ్ పంపుతామని నేను ఎవరినీ మోసం చేయలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాష్ట్రానికి ఆదా యం వస్తుంది. మరో వైపు.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని కేటీఆర్ చెబుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయం..ఎవరి పాపాన వారు పోతా రని వదిలేశాం. నేను దాక్కున్నానని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్.

తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పం పించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆ ర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?..  హరీశ్ రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకా యే లేదు. కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది.

తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. ఏపీలో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసు? మా ఊరికొస్తావా? మీ ఊరికి రావాలా? ఎవరు భయపడుతున్నారో తెలుస్తుంది’ అని సీఎం అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించాంమని, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చామని. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టామని. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినమని సీఎం చెప్పారు.

‘12,726  పంచాయతీల్లో 8,335 మంది సర్పంచులను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా? 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి.  ఇప్పటికైనా కేసీఆర్ వయ సును గౌరవిస్తాం. ఈనెల 29 నుంచి అసెం బ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మీరు చెప్పిన అన్ని అంశాలపై చర్చిద్దాం రండి.

అసెంబ్లీలో చర్చించకుండా ఫాంహౌస్‌లో నిద్రపోయి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు వింటారు. కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా.. గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి’ అని విపక్ష నేతకు  రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. 

దమ్ముంటే ఆపండి..

గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని,  తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవ డానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తు లు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదని సీఎం అన్నారు. ‘పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పనులు మొదలయ్యేలా చర్యలు చేపట్టాం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులు మన ముందు ఉన్నాయి.

కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా.. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు  పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా. రాష్ట్రంలో మరోసారి వచ్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమే. దమ్ముంటే ఆపండి అని’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.