25-12-2025 03:05:51 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 24(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్, విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలను పూర్తిగా వెంటనే చెల్లించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొని, మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రూ, 6000 కోట్లు ఉంటే కేవలం రూ, 37 కోట్లు మాత్రమే విడుదల చేసి, బీసీ విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఆనాడు నేను చేసిన పోరాటంతో అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ప్రకటించి, విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తూ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే మూసీ సుందరీకరణ, స్పోరట్స్ సిటీ, ఫోర్త్ సిటీకి వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారని? నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు జిల్ల పల్లి అంజి, నీల వెంకటేష్, అనంతయ్య, గుజ్జసత్యం, విద్యార్థులు పాల్గొన్నారు.