13-12-2025 01:44:08 AM
ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఆదేశం
సిద్దిపేట కలెక్టరేట్, డిసెంబర్12: గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీఓ, ఎంపిడీఓ, ఎంపీవో, తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ స మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో 10 మండలాల్లో 182 పంచాయతీలు,1644 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏకగ్రీవమైన గ్రామాలు, వార్డులను మినహాయించి మిగతా పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీకి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్‌ఓ, పీఓ, ఓపీఓ, పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయాలని, కౌంటర్లు పెంచి కౌంటింగ్ కు అంతరాయం లేకుండా చూడాలని ఎంపిడీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు.
పోలింగ్ సిబ్బంది కేటాయించిన రూట్లలో లంచ్ తరువాత వెంటనే స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో బ్యాలెట్ బాక్స్, ఫర్నిచర్ తదితరాలు సెట్ చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల రోజు ఉదయం మాక్పోల్ అనంతరం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుందని, అప్పటి వరకు లైన్లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, కౌంటింగ్ కేంద్రాల్లో ఫోన్లు నిషేధితమని హెచ్చరించారు. గ్రామాల్లో బీఎల్‌ఓలు 100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.