21-07-2025 12:09:19 AM
- సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ ఉద్యోగుల ఎదురు చూపులు
- పదోన్నతుల అంశం త్వరగా తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఉద్యోగులు తమపైన పని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఉద్యోగులకు పదోన్నతులు లేకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో ఇటీవల ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ మీద దేవాదాయ శాఖకు తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
వీటిలో 61 మంది ఈవోలు (గ్రేడ్ 3), ఆరుగురు ఈవోలు (గ్రేడ్ 1), ఆరుగురు అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలనుకున్నారు. సిబ్బం ది కొరత వేధిస్తుండటంతో ఈ ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నా లు అంతగా ఫలించడం లేదని ఉద్యోగ వర్గా లు అంటున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా భర్తీ చేయాలని చేసిన ప్రకటనకు కేవలం ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటేషన్లపై వచ్చేందుకు ఇతర శాఖ అధికారు లు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
దేవాలయ భూములు అన్యాక్రాంతం
రాష్ట్రంలో కొన్ని దేవాలయ భూముల రక్షణ వ్యవహారం క్లిష్టంగా మారిందని శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. దేవాదాయ శాఖ కింద దాదాపు 90వేలకు పైగా ఎకరాలున్నాయి. వాటిల్లో దాదాపు 20వేల ఎకరాలకు పైగా భూమి మన రాష్ట్రం లో, దాదాపు 6వేల ఎకరాల భూమి ఇతర రాష్ట్రాల్లో అన్యాక్రాంతం అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. పెద్దఎత్తున భూములు వివాదస్పదం కావడం, కొన్ని కోర్టుల్లో, కొన్ని లిటిగేషన్లతో, మరికొన్ని అన్యాక్రాంతం కావడం కావడంతో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక సిబ్బంది లేక పోవడం వల్ల ఒక్కో ఈవో ఐదారు దేవాలయాల విధులను చూసుకోవాల్సి వస్తుంది. దీనితో విధుల నిర్వహణ తమకు భారంగా మారుతోందని ఎప్పటినుంచో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇటీవల భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడితో తాము క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో తెలియ జేస్తోందంటున్నారు.
పదోన్నతుల సమస్య
దేవాదాయ శాఖలో పదోన్నతుల సమస్య కూడా వేధిస్తోంది. సకాలంలో పదోన్నతులు చేపడితే భక్తులకు సేవలను మెరుగ్గా అందించగలుగుతామని ఉద్యోగులు చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదోన్నతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పదోన్నతుల సమస్యను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళితే సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
కాగా ఇటీవల దేవాదాయ శాఖ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఆలయాల వార్షిక బడ్జెట్ కోసం దేవాలయాలు ప్రభుత్వ అనుమతిని విధిగా తీసుకోవాలని ఆదేశించింది. దీని వలన అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేవాదాయ శాఖలో నెలకొన్న పదోన్నతులు, డిప్యూటేషన్లు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ఉద్యోగు లు కోరుతున్నారు.