21-07-2025 12:10:04 AM
నాగార్జునసాగర్, జులై,20: ఆషాఢ మాసం ఆదివారం కా వడంతో సాగర్ హిల్కాలనీ, పైలాన కాలనీల్లో బోనాల సందడి నెలకొంది. భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వరకు బోనాలతో పాటు ఫలహార బండ్లు, తొట్టెల, అమ్మవారి శకటాలతో పాటు పోతురాజుల విన్యాసాలు, డప్పువాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో వచ్చి దేవతలకు నైవేద్యం సమర్పించారు హిల్కాలనీ డౌన పార్కు ముత్యాలమ్మ ఆలయం, బుద్ధవనం భవానీ ఆలయం వద్ద, పైలాన కాలనీ పోచమ్మ ఆలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
అమ్మ చల్లంగా దీవించు అంటూ..ఆదివారం నందికొండ మున్సిపాలిటీ 9వ మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి హాజరయ్యారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది.
పట్టణంలోని పలు కాలనీల వాసులు హాజరై బోనాలను ఊరేగింపుగా తీసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే పేరున్న ముత్యాలమ్మ కాళికమ్మ దేవాలయాల్లో భక్తులు దర్శనం చేసుకుని కానుకలు సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాజరై బోనమెత్తి అమ్మవారికి హారతి అందించారు. పాడిపంటలతో రైతులు, తాలూకా, పట్టణ ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరారు. బోనాల పండుగలో పట్టణ నాయకులు, ప్రజలు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.