calender_icon.png 7 November, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడెక్కిన జూబ్లీహిల్స్

07-11-2025 01:02:40 AM

రాజకీయ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేతలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నడూ చూడని అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన నాయకులు గల్లీల్లో తిరుగుతూ ప్రజలతో వరుసలు కలుపుతూ మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో గెలిచి గ్రేటర్ పరిధిలో తమ ఎమ్మెల్యేల బలాన్ని పెంచుకోవాలని చూస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు శత విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకుని నగరంలో తమకు పట్టు ఉన్నదని నిరూపించుకునేందుకు బీజేపీ తహతహలాడుతున్నది.

ఈ క్రమంలో మూడు పార్టీల నేతలు రోడ్‌షోలు, బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట నాయకులను అప్రమత్తం చేస్తోంది. 

మీరంటే.. మీరే కలిసి పోయారు

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణం. అయితే గత పార్లమెంట్ ఎన్నికల నుంచి కుమ్మక్కు రాజకీయాలు అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇది పునరావృతం అవుతున్నది. కాంగ్రెస్‌ను ఓడించేం దుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ పని చేయగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ సహకరిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అనే  ప్రజల్లోకి బలంతీ తీసుకెళ్తే ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కాంగ్రెస్ వైపు గంపగుత్తగా మల్చుకోవచ్చనే వ్యూహంతో నేతలు పావులు కదుపుతున్నారు. అదే స్థాయిలో బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్‌పై ఎదురుడాది చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌తో ఎలాంటి అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు బీజేపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే తమపై బురద జల్లుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు బదులిస్తున్నారు. 

కాంగ్రెస్‌ను నిలదీస్తున్న ప్రజలు

అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిద్రపట్టకుండా చేస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు. ఇంకా  చాలా వరకు అమలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌పై కొంత వ్యతిరేకత వచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో.. ఇక్కడి ప్రజలు కూడా హామీల అమలు ఎప్పుడని ప్రచారంలోకి వెళ్లిన నాయకులను నిలదీస్తున్నారు.

ప్రజా వ్యతిరేతను గమనించిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ చేజారితే ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవనే అంచనాకు వచ్చారు. దీంతో ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఎన్నికల రంగంలోకి దిగారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ పథకం పరిమితి పెంపు లాంటి అంశాలను ప్రజలకు వివరిస్తూనే.. ప్రధానంగా బీసీ నినాదం ఎత్తుకున్నది.

బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు సునీత, దీపక్‌రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారంలో ముందుకెళ్తోంది.