11-05-2025 12:48:43 AM
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, కల్నర్ సోఫియా ఖురేషి ఇవాళ దేశ ముఖచిత్రంపై సగర్వంగా రెపరెపలాడుతున్న మహిళామణులు. ఈ దేశమాత నుదుటి సిందూరమై సమస్త మహిళా లోకం గర్వంగా తలెత్తుకునేలా చేసిన వీరమహిళలు వాళ్లు. ఇవాళ దేశం యావత్తు వాళ్ల గురించే చర్చించుకుంటున్నది. ఏ సోషల్ మీడియా అకౌంట్ చూసినా వాళ్ల ముఖచిత్రాలే ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతకీ ఎవరు వీళ్లు.. ఏమిటీ వీళ్ల నేపథ్యం.. ఏరీకోరి ఎందుకు భారత ప్రభుత్వం వీళ్లనే ఎంచుకున్నదో తెలియంటే.. లెట్స్ రీడ్ దిస్ స్టోరీ..
తాతయ్య స్ఫూర్తితో..
‘యుద్ధం వినాశనానికి సంకేతం’ అన్న సందేశాన్నిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతల్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు కల్నల్ సోఫియా ఖురేషి. ప్రస్తుతం భారత సైన్యానికి చెందిన ‘corps of signals’ దళంలో ఆఫీసర్‌గా ఉన్న ఆమె.. అందులోని ‘మిలిటరీ కమ్యూనికేషన్స్-సమాచార వ్యవస్థ’కు సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. 2016లో తన 35 ఏళ్ల వయసులో పుణేలో భారత ఆర్మీ నిర్వహించిన ‘Exercise Force 18’ అనే కార్యక్రమంలో 40 మంది సైనికులున్న భారత బృందానికి నాయకత్వం వహించారు సోఫియా.
ఇందులో 18 దేశాల ఆర్మీ సైన్యాలు పాల్గొనగా.. ఒక్క మన బృందాన్ని మినహాయించి మిగతా అన్ని బృందాలకు పురుషులే నాయకత్వం వహించారు. ఇలా ఈ మిలిటరీ కార్యక్రమంలో ఏకైక మహిళా నాయకురాలిగా బాధ్యతలు నిర్వర్తించి చరిత్ర సృష్టించారు సోఫియా. శాంతి పరిరక్షణ, మందుపాతరల తొలగింపు.. వంటి అంశాలపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ఇదే కాదు.. 2006లో కాంగోలో నిర్వహించిన ‘ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్’ లోనూ భాగమైన ఆమె.. దాదాపు ఆరేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతల్ని కాపాడే కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.
ఇలా తన మూడు దశాబ్దాల సుదీర్ఘ ఆర్మీ కెరీర్‌లో దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకే కృషి చేశారు ఆర్మీ ఆఫీసర్. గుజరాత్‌కు చెందిన ఈ లేడీ ఆఫీసర్.. భారత సైన్యంలో పనిచేసిన తన తాతయ్యను చూసి రక్షణ రంగంలోకి రావాలనుకున్నారు. సోఫియా భర్త కూడా ఆర్మీ అధికారే. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేసిన ఆమె.. చదువు పూర్తి కాగానే సైన్యంలోకి అడుగు పెట్టారు.
చిన్ననాటి కల
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమిక అంటే ఆకాశపు కుమారై అని అర్థం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్‌సీసీలో చేరి.. తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.
అన్నీ సాహసాలే..
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీతా వంటి హెలికాఫ్లర్లను నడుపుతూ.. జమ్మూకశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల నుంచి.. ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు. పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశానికి సమాచారం ఇవ్వడమే కాక.. భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతున్నది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు.
నా కల నెరవేరింది!
మేం నిన్న ఫోన్‌లో మాట్లాడుకున్నాం.. ఆమె ఒక ఆఫీసర్‌గా రేపు ఉదయం ఏం జరుగుతుందో ఒక్కమాట కూడా మా దగ్గర ప్రస్తావించలేదు. ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ సోఫియాను ఈ స్థానంలో చూడటం గర్వకారణంగా ఉంది. ఆమె ఎప్పుడూ దేశానికి ఏదైనా చేయాలనే మక్కువను కలిగి ఉండేది. సోఫియాకు డీఆర్డీవోలో చేరాలని.. శాస్త్రవేత్త అవ్వాలని.. డాక్టర్ అబ్దుల్ కలాంతో కలిసి పనిచేయాలని కోరిక ఉండేది.
యూఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె భారతదేశంలోనే ఉండి ఆర్మీలో చేరాలని కోరుకున్నది. అలా మొదటి ప్రయత్నంలోనే ఆర్మీకి ఎంపికైంది. మొదట్లో నాకు ఆర్మీలో పనిచేయాలనేది నా కల. కానీ ఎన్‌సీసీలో ఉండి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. నేను ఎంపిక కాలేదు. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నా. కానీ, సోఫియాను యూనిఫాంలో చూసినప్పుడు.. నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది.
షైనా సున్సారా, కల్నల్ సోఫియా సోదరి