07-11-2025 12:59:04 AM
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలో జనసేన మద్దతు తీసుకుంటున్న బీజేపీ, టీడీపీని మాత్రం పక్కనపెట్టింది. ఈ నియోజకవర్గంలో మూడు లక్షల వరకు ఓటర్లు ఉండగా, అందులో సగానికి పైగా సీమాంధ్ర మూలాలున్న వారే.
బీజేపీ అభ్యర్థి విజయం కోసం జనసేన మద్దతు తీసుకున్న బీజేపీ, టీడీపీ మద్దతును తీసుకోకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబుకు అవమానం ఎదురైనట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నా రు. దీంతో 18 నెలల క్రితం ఏపీలో ప్రభంజనం సృష్టించిన టీడీపీ, -బీజేపీ-, జనసేన కూటమిలో అంతర్గత విభేధాలు మొదలైనట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ, స్టార్ క్యాంపెయినర్‌గా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించి, చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లను పక్కన పెట్టడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక వ్యూహమా? లేక బలమైన కూటమిలో ఏర్పడుతున్న తొలి బీటలా? అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
బాబును పిలిస్తే.. పాత రోజులు గుర్తుకొస్తాయని భయం
ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి 21 స్థానాలను పవన్ కల్యాణ్ గెలిపించుకున్నారు. పవన్‌కల్యాణ్‌కు ఉన్న స్టార్ పవర్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకులు భావిం చారు. ప్రాంతీయ విభేదాల మరక అంటని పవన్ ఇమేజ్.. యువతను, రాజకీయాలకు అతీతంగా ఉండే ఓటర్లను ఆకట్టుకుంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. అయితే, కూటమిలో కీలక నేత, ఏపీలో విజయానికి సూత్రధారి అయిన చంద్రబాబును ఆహ్వానించకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, అమరావతిలో చంద్రబాబును కలిసిన తెలంగాణ టీడీపీ నేతలు, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా కనీసం బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ, ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది. ఈ పరిణామానికి బలమై న కారణాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు పేరు వినగానే 2014కు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శకం గుర్తుకు వస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని బాబు గట్టిగా వాదించ డం, నాటి ఉద్యమకారులలో తీవ్ర వ్యతిరేకతను రగిల్చింది. ఇప్పుడు బాబును ప్రచారా నికి పిలిస్తే, “ఆంధ్రా ఆధిపత్యం” అనే పాత నినాదాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తెరపైకి తెచ్చి, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని బీజేపీ భయపడుతోంది.
తెలంగాణ టీడీపీ పునరుజ్జీవ ఆశలు
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటిసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏపీలో గెలుపుపైనే టీడీపీ పూర్తిగా దృష్టి సారించింది. ఆ వ్యూ హం ఫలించి 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 175కు 164 స్థానాలు గెలుచుకుంది. ఈ విజయంతో ఉత్తేజితులైన తెలం గాణ టీడీపీ కార్యకర్తలు, ఇప్పుడు తమ పార్టీ పునరుజ్జీవం కోసం ఎదురుచూస్తున్నారు.
పాత చరిత్ర పునరావృతం అవుతుందా..?
బీజేపీతో చంద్రబాబుకు ఉన్న బంధం ఎప్పుడూ ఒడిదొడుకులతోనే సాగింది. 1998లో అయోధ్య అంశంపై వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ, ఇద్దరు కేంద్ర మంత్రులను వెనక్కి పిలిచి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ రాజకీయ ఎత్తుగడ బెడిసికొట్టి, 2019లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. అయితే, నేటి పరిస్థితి వేరు.
మోదీ మూడోసారి ప్రధాని కావడంలో 16 మంది ఎంపీలతో చంద్రబాబు కింగ్‌మేకర్‌గా ఉన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్‌లో ఎదురైన ఈ చిన్న అవమానం పెద్దదిగా మారితే, కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. అయితే, 2024 ఎన్నికల్లో “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచిన పవన్ కల్యాణ్, రెండు పార్టీల మధ్య వారధిగా వ్యవహరిస్తూ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంది.