calender_icon.png 1 December, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువులకే గురువు గోపాలకృష్ణారావు

29-11-2025 12:00:00 AM

‘బాబు మీదేవూరు? ఎక్కడుంటావు’ అని నన్ను ప్రేమ పూర్వకంగా అడిగిన వారెవరో కారు.. వారే ఆచార్య కె.గోపాలకృష్ణారావుగారు. గౌలిపురాలో గుండేరావు హర్కారే ఇంట్లో నన్నుచూసి, గోపాలకృష్ణరావు గారు నా గురించి తెలుసుకున్న సందర్భమది. పాతపట్నంలోనే నివాసం కనుక అప్పుడప్పుడు గోపాలకృష్ణారావుగారు గుండేరావు గారిని కలుసుకోవడానికి వచ్చేవారు. ఫారశీక ఉర్దూ భాషల్లో ఇద్దరూ ఉద్ధండపండి తులే. వీరిద్దరూ ఉర్దూలో మాట్లాడుకున్నప్పుడు, నేను పూర్తిగా అయోమయంలో పడిపోయేవాణ్ణి. నాకు తెలుగు తప్ప ఉర్దూ భాషతో పరిచయమే లేదు.

సంస్కృతం అంటారా? అప్పటికి దాని పరిమళమంటనే లేదు. పన్నెండు భాషల పండితుని ఇంట్లో నాలుగైందేండ్లు ఎట్లున్నానంటే, అదే పూర్వజన్మసుకృతమనక తప్పదు. గుండేరావు గారి ఇంటికి ఎవరో ఒకరు వచ్చి శాస్త్రసంబంధమైన శాబ్దిక చర్చ, వేదాంత చర్చ కొనసాగిస్తూ ఉండేవారు. నేను ఒక మూలన చేతులు కట్టుకొని వినేవాణ్ణి.

ఒక విధంగా నా వినయమే గుండే రావు తాతయ్యతో పాటు, మాట్లాడడానికి తరచుగా వచ్చే గోపాలకృష్ణారావు గారికి ఎంతగానో ఆకర్షించింది. వచ్చినప్పుడల్లా ‘బాగున్నారా?’ అని బహువచనంలో గోపాలకృష్ణారావు నన్ను సంబోధించినప్పుడు నేను కొంచెం సిగ్గుపడేవాణ్ణి. అది 1973వ సంవత్సరం. అప్పటికీ డిప్.ఓ.ఎల్ చదువుతున్నాను. ఆ సమయంలోనే గోపాలకృష్ణారావుగారి చల్లనిచూపులు నామీద పడడం అదృష్టం అనక తప్పదు.

నా ప్రత్యక్ష గురువు..

నాకు గుండేరావు గురువుగారిచ్చిన ప్రోత్సాహంతో, తెలుగులో ఏ పరీక్షలోనైనా అందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలనే కోరిక కలిగింది. గుండేరావుగారితో మిక్కిలి వ్యాకరణ సంబంధం కలిగిన ఆచార్య రవ్వా శ్రీహరి గారు డిప్.ఓ,ఎల్ (ఆంధ్ర సారస్వత పరిషత్తు)లో నాకు ప్రత్యక్ష గురువైతే, అదృష్టవశాత్తు 1978 సంవత్సరాల మధ్య కాలంలో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య గోపాలకృష్ణారావుగారు నామీద అత్యాంతానురాగం కురిపించే గురువులయ్యారు. ప్రత్యక్ష ఉపదేశికులయ్యారు.

ఉదయం తెలుగు పండితునిగా ఉద్యోగంలో ఉన్న కారణంగా, బషీర్‌బాగ్‌లోని ‘నిజాం పీజీ కళాశాలలో ఎం.ఏ తెలుగు చదివే అవకాశం లభించింది. శాఖాధ్యక్షులుగా ఆచార్య గోపాలకృష్ణారావుగారు ఉండడం వల్ల మాకు మంచి విద్యాబుద్ధులబ్బాయి. సినారె, అమరేశం, ఇరివెంటి, ముదిగొండ, ఎస్వీ రామారావు, యశోదారెడ్డి, ఆనందమూర్తి, సీతా కళ్యాణి మొద లైన ఆచార్యులు ప్రతిరోజు క్లాసులు తీసుకోవడం వల్ల ఎం.ఏ క్లాసులో ప్రవేశం పొందిన ముప్పది మందిమి తప్పక హాజరయ్యేవాళ్లం.

మా క్లాసులో అప్పటికే ఒక రు భాషా శాస్త్రంలో, మరొకరు సంస్కృతంలోనే పిహె.డి డిగ్రీలు తీసుకున్నారు. అయినా మాతృభాషాభిమానం వారిని తిరిగి ఎం.ఏ క్లాసులకు రప్పించిందంటే, ఆనాటి విశ్వవిద్యాలయ ఆచార్యుల బోధన ఎంత ఆదర్శవంతంగా, ఎంత ప్రభావవంతంగా, ఎంత ప్రతిభావంతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఎం.ఏలో ఫస్టుర్యాంకు..

స్వయంగా నేను ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు సైకిలెక్కి విద్యానగర్ నుంచి ఆర్ట్స్ కాలేజీకి రాగా చూశాను. అట్లే ఆచార్య కె.గోపాలకృష్ణారావుగారు అలియాబాదులో రిక్షా ఎక్కి, చార్మినార్ దగ్గర దిగి, అక్కడి నుంచి ఎర్రబస్సెక్కి బషీర్‌బాగ్‌కు ప్రతిరోజు మాకు పాఠాలు చెప్పడా నికి వచ్చేవారు. చేతిలో ఒక చిన్నబ్యాగు తప్పనిసరి ఉండేది. రాత్రి తొమ్మిదిదాకా మాకు పాఠాలు చెప్పి, బస్సెక్కి పాతపట్నంలోని తమ ఇంటికి పోవడం అంటే, ఆచార్యుల వారికి ఎంత కష్టమయ్యేదో మాటలతో చెప్పలేం.

విద్యార్థుల బాగుగోరే గురువులు ఎన్ని కష్టాలైనా భరిస్తారు కాబోలు! నేను ఎం.ఏ చదువుతున్న సమయంలో తెలుగుశాఖ వైభవం ఇంతంత కాదు. ఆచార్యులు ఒకరిని మించి మరొకరు మాకు బోధిస్తే, మా విద్యార్థులం ఒకరిని మించి మరొకరు ప్రతిభ చూపెట్టాలనుకునేవాళ్లం. పి.జి. కళాశాలలో అది సాయంత్రపు చివరి బ్యాచి. ఆ అవకాశం నాకు పూర్తిగా ఉపయోగపడింది.

మొత్తం తెలుగుశాఖలో ఎం.ఏ (1980)లో డిస్టింక్షన్‌తో పాటు ఫస్టుర్యాంకు సంపాదిం చడానికి, నా కృషితో పాటు, ఆచార్యుల ప్రోత్సాహం నాకెంతో తోడ్పడింది. నాకు గోల్డ్ మెడల్ లభించినందుకు అందరి కంటే ఎక్కువగా సంతోషపడినవారు గోపాలకృష్ణారావుగారే. ఎందుకంటే వా రు మాకు పి.జి.కళాశాలలో తెలుగుశాఖాధ్యక్షులుగా అప్పుడున్నారు కనుక.

ముందుమాట..

ఇక్కడ నేను అసలు విషయం ఒకటి చెప్పక తప్పదు. హైదరాబాదు నడిబొడ్డున గల ప్రగతి కళాశాలలో జూనియర్ తెలుగు లెక్చరర్ పోస్టు ఖాళీ అయ్యింది. దానికి నూటికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంటర్య్వూ జరిగి అప్పటికి పదిరోజులైంది. ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలి యదు. అప్పటికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షస్థానంలో ఆచార్య కె.గోపాలకృష్ణారావు గారున్నారు.

గురువు గారికి నమస్కరించి ‘ఎవరు సెలెక్ట్ అయ్యారు సారు’ అని వినయంగా అడిగాను. వారు చిరునవ్వు నవ్వి దగ్గరికి పిలిచి, నువ్వు అదృష్టవంతుడివయ్యా! గుండేరావు హర్కారే తాతయ్య ఆశీర్వాదం నీ మీద బాగా పనిచేసింది’ అని అభినందించారు. ఆనందం పట్టలేక వారి పాదా లను స్పృశించి ఆశీస్సులు అందుకొన్నా ను. అంతలోనే ఎవరో ఆఫీసుడోర్ దగ్గర ఉండి చప్పుడు చేశారు. ‘ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవడానికి చాలా మంది వస్తున్నారు.

వారికి జవాబు చెప్పలేక ఇబ్బందిగా ఉంది. నువ్వు మాత్రం ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నేను పంపించాను అని చెప్పు’ అని ధైర్యం చెప్పి పంపించారు. 1980 ప్రాంతంలో ఏ చిన్న ఉద్యోగాన్ని పొందాలన్నా ఎంత పోటీ ఉండేదో ఆచార్యుల వారి మాటలనుబట్టి నాకర్థమైంది. ఆచార్య గోపాలకృ ష్ణారావు గారు ఖండవల్లి వారి ప్రేమను చూరగొన్నవారు. మితభాషి, ఆడంబరం లేని విజ్ఞాన భండారం.

శతకవాఙ్మ మీద వారు చేసిన పరిశోధన నేటికీ ప్రమాణం. వారి సిద్ధాంతగ్రంథం ‘ఆంధ్ర శతక సాహిత్య వికాసం’ అలభ్యం. వారి ‘తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గోపాలకృష్ణారావు గారి సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు ఉర్దూ నిఘంటువు’.. అంజుమన్ తరఖీ’ అనే సంస్థ ప్రచురించింది.

ఉర్దూలో వేమన మీద ఒక గ్రంథం రాసిన ఘనత గోపాలకృష్ణారావుగారిదే. ‘సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం’లో వారి వ్యాసాలు వెలకట్టలేనివి. విశేషించి వారి గురించి చెప్పాలంటే, సినారె, జి.రామిరెడ్డి, బిరుదురాజు రామరాజు వంటి దిగ్దంతులైన ప్రొఫెసర్లకు గోపాలకృష్ణారావుగారు ప్రత్యక్ష గురువు. నా గురువులకే గురువు. నా తొలి కృతి ‘మల్లి పదాలు’ (1980) ఆచార్య గోపాలకృష్ణారావుగారి ‘ముందుమాట’తో రావడం నా అదృష్టం.

వ్యాసకర్త సెల్: 98885654381