28-11-2025 12:51:17 AM
అధికారులపై తిరగబడ్డ కబ్జారాయుళ్లు
అధికారులకు బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు
తుర్కయంజాల్, నవంబర్ 27: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్‌లో కబ్జారాయుళ్లు బరితెగించారు. సర్వే నెంబర్ 126లోని సుమారు 400 గజాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి అందులో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ అధికారులు గురువారం రోజున కబ్జాను అడ్డుకున్నారు. కబ్జా చేసిన స్థలం చుట్టూ గుంత తవ్వి రక్షించారు.
కట్టడం దగ్గర ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు. నిర్మాణంపై కోర్టు స్టే ఉండటంతో కూల్చే ప్రయత్నం చేయనట్టు తెలుస్తోంది. అయితే, కబ్జాను అడ్డుకునే సమయంలో అక్రమ నిర్మాణం చేపట్టిన స్వామి, విజయ్‌కుమార్... బెదిరింపులకు గురిచేశారు. కబ్జాను ఆపాలని కోరిన తమపై బూతులతో రెచ్చిపోయారని రెవెన్యూ అధికారులు తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం ఆపబోమని, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించారన్నారు. తిరిగి తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారని వాపోయారు.