calender_icon.png 11 August, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతారంలో కరువైన ప్రభుత్వ వైద్య సేవలు

11-08-2025 12:20:32 AM

ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్న గ్రామస్తులు

ఏఎన్ఎం లేక..ఎం ఎల్ ఎచ్ పీ డిప్యూటేషన్ వెళ్లడంతో సేవలు బంద్

మా డాక్టర్ మాకు పంపించండి గ్రామస్తులు వేడుకున్నా ఉన్నతధికారులు బుట్టదాఖలు

ప్రణాంతక వ్యాధులు రాకముందే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న గ్రామస్తులు

పెన్ పహాడ్: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం (సబ్ సెంటర్) వైద్యుడిని 2 సంవత్సరాల క్రితం డిప్యూటేషన్ పేరుతో జిల్లాలోని రాజీవ్ నగర్  ఉపకేంద్రానికి బదిలీ చేశారు వైద్యరోగ్యాశాఖ ఉన్నత అధికారులు. దీని ఫలితంగా, గ్రామంలో ప్రాథమిక వైద్య సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోనే అనంతారం పెద్ద గ్రామం కావడంతో సుమారు 5వేల మందికి పైగా జనాభా ఇక్కడ నివసిస్తోంది. వీరంతా వ్యవసాయ కూలీలు, దళితులు అధికంగా నివసిస్తున్నారు. 

వర్షాకాలం సమీపించినందున సీజనల్ వ్యాధులు, శృతి మించితే ప్రాణంతక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పైగా వీరిలో చాలామందికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ఇటీవల మండలానికి సందర్శనకు వచ్చిన డిప్యూటీ డీ ఎం ఎచ్ ఓ, ఏఓ కోటిరత్నంకు వినతి పత్రం అందజేశారు. “మా ఊరి వైద్యుడిని తిరిగి నియమించాలని, లేకపోతే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది” అని వారంతా ఆవేదనతో పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు.

పేద ప్రజల ఆశలు బుట్టదాఖలు..

గ్రామానికి వైద్యాధికారిని నియమించి తమ బాధలు అర్ధం చేసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని..మేమంతా బడుగు బలహీన వర్గాలు, దళితులమని.. తమ ఆర్ధిక భారాన్ని కాపాడాలని..వేడుకుంటూ ఉన్నత అధికారులకు వినతి పత్రం అందించినా బుట్టదాఖలు చేయడంపై ప్రజా ప్రభుత్వంపై నమ్మకం సన్నగిళ్ళుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

జ్వరం.. భయం.. భారం..

వర్షాకాలం వచ్చింది.. ఊరినిండా దోమలు.. సీజినల్ వ్యాధులు వస్తున్నాయి. బజారుకు ఒక్కరో.. ఇద్దరో మంచానికి ములుగుతున్నారు. ఈ గ్రామంలో పర్మినెంట్ ఏఎన్ఎం పోస్ట్ ఖాళీ కావడం..ఉన్న డాక్టర్ ని డిఫ్యూటేషన్ మీద పంపించటం.. ఈ పోస్టు అధికారులు ఖాళీ చూపించక పోవడంతో ఈ గ్రామానికి అధికారుల నిర్లక్ష్యం జబ్బు పట్టిందని ఊరి పేద ప్రజలు ఆవేదన అంత ఇంత కాదు. సీజినల్ 'జ్వరాలు' వస్తే మా పరిస్థితి దారుణంగా ఉన్నాయి. సమయానికి ఆరోగ్య పరిస్థితిని చూపించుకుందామంటే వీరు ఎవరు అందుబాటులో ఉండరు. ఆశాలు ఉంటే ఏం చేస్తారు. 'భయం' వేస్తుంది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లుదామంటే భయం.. అప్పు తెచ్చుకొని చూపించుకోవడం 'భారం'గా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రజల ప్రాణాలు అధికారుల చేతిలో..

మా డాక్టర్ ని మా గ్రామానికి తిరిగి పంపించి..పేదల ప్రజా ఆరోగ్యం కాపాడాల్సింది ఉన్నత అధికారులదేనని నిర్లక్ష్యం చేస్తే పేద ప్రజల ఆరోగ్యం మట్టిలో కలసి పోతుందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

 ప్రజా ఆరోగ్యం మెరుగుకు చర్యలు..: మండల వైద్యాధికారి డాక్టర్. రాజేష్

అనంతారం సబ్ సెంటర్ పక్కా బిల్డింగ్ పనులు అనివార్య కారణాల వల్ల నిలిచి పోయాయి. బిల్డింగ్ పనులు పూర్తి అయ్యే లోపు తాత్కాలిక ప్రభుత్వ బిల్డింగ్ లో ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఎం ఎల్ ఎచ్ పీ ఏర్పాటు విషయంలో అధికారులకు విన్నవించి ప్రజల కోరిక మేరకు చర్యలు చేపడుతాం. ప్రజా ఆరోగ్యం వైపే  వైద్యారోగ్యాశాఖ అడుగులు. నిత్యం వైద్య సేవలు అందిస్తూ అందుబాటులో ఉంటాం.