14-10-2025 06:41:25 PM
మండల తహసిల్దార్ సతీష్ కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వాధీనంలోకి తీసుకోవడం జరిగిందని మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకున్న వృద్దాశ్రమాన్ని నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హయాంలో వృద్ధాశ్రమం నిర్మాణానికి టెండర్ పిలువగా టెండర్ దక్కించుకొని పనులు చేపట్టడం జరిగిందని నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామన్నారు.
వృద్ధాశ్రమంతో పాటు, వృద్ధులకు వంట చేయడం చేయడం కోసం కిచెన్ షెడ్ నిర్మాణం చేయడం జరిగిందని అంతేకాకుండా బోర్ ఏర్పాటు చేశామని వీటికి సంబంధించిన బిల్లులు గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. పూర్తయిన భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని ఖాళీగా ఉన్న భవనంలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోవడంతో భవనానికి తాళం వేయడం జరిగిందన్నారు. భవనాన్ని తహాసిల్దార్ చేతుల మీదుగా ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని, ఈ మేరకు తాళం చెవులను రెవెన్యూ అధికారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.