14-10-2025 06:46:18 PM
మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం..
సిఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ..
చండూరు (విజయక్రాంతి): చండూరు మండల కేంద్రంలోని తోపుడు బండ్లు డబ్బా కోట్లను తొలగించాలని ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా వర్కర్లపై సమస్యలు పరిష్కరించాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఏ మల్లేశంకు అందజేశారు. చండూర్ మున్సిపల్ కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా తోపుడుబండ్లు డబ్బా కోట్లు పెట్టుకొని సుమారు 100 మంది కార్మిక కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రోడ్డు నిర్మాణం పేరుతో మున్సిపల్ అధికారులు కార్మికులకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోవాలని అనడం అన్యాయమని అన్నారు. కుటుంబాలకు ఫుట్పాత్ వ్యాపారమే జీవనాధారం అని అలాంటి వారి పొట్ట మీద కొట్టకుండా ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు.
రోడ్డు నిర్మాణానికి ఆటంకం లేకుండా తమ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నదని అన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో లాగే మా వ్యాపారాలు కూడా కొనసాగించాలని ఆయన మున్సిపల్ కమిషనర్ ని కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్, చిరు వ్యాపారులకు ఇచ్చే రుణాలు ఇప్పిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం తీసుకున్న కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జేరిపోతుల ధనంజయ్, సీనియర్ నాయకులు మోగదాల వెంకటేశం, తోపుడు బండ్లు, డబ్బా కోట్ల వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరిగి యాదయ్య, గంట యాదగిరి, దేవయ్య, వాజిద్, నరసింహ, జక్కలి నాగరాజు, వాణి, మండలి వెంకటేశం, జహంగీర్, అంజమ్మ, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.