14-10-2025 08:35:41 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట మండల కేంద్రాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజననాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో అన్ని సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ గైర్హాజరు అయినట్లయితే, అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాల తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. సెలవులు పూర్తిచేసుకుని తిరిగి పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్ లో సంప్రదించి విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చర్యం తీసుకోవాలని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసనా సామర్థ్యాలను పరీక్షించారు. జిల్లాలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో విద్యనభ్యసించి నీట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నిర్మల్ జిల్లాలో ఎం.బి.బి.ఎస్. సీటు సాధించిన విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.