calender_icon.png 22 July, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి ప్రభుత్వ సంకల్పం

22-07-2025 12:42:26 AM

-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

-వృత్తి శిక్షణ కేంద్రం ప్రారంభం 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 21 (విజయ క్రాంతి):యువతకు ఉపాధి కల్పనతో అండగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టాస్క్ (టి ఏ ఎస్ కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన యువతకు బహుళ జాతి సంస్థలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాయని, టాస్క్ ద్వారా 50 పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

శిక్షణ పొందిన అభ్యర్థులకు సింగరేణి, విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మాట్లాడుతూ, యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కేంద్రాలు యువత తమపై తాము ఆధారపడేలా చేయడం లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే, శిక్షణా కేంద్రంలో ఫాకల్టీ ఉత్తమంగా ఉండేలా చూసుకోవాలని, కేవలం నామమాత్రంగా కాకుండా ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కేంద్రాన్ని ఉత్తమ శిక్షణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.  

సింగరేణి, జెన్కో వంటి ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఈ కేంద్రాలు ఉపాధి కల్పన వేదికగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని భాస్కర గడ్డలో రెండు పడక గదుల ఇళ్ళు మంజూరు అయిన లబ్ధిదారులకు నూతన బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రంధాలయాన్ని ప్రారంభించారు.