05-05-2025 02:53:21 AM
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూర్,మే04(విజయక్రాంతి): మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజుల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం దిగువ మానేరు డ్యామ్ (ఎల్.ఎం.డి) తీర ప్రాంతానికి ఉదయం నడకకు వెళ్లినప్పుడుమత్స్యకారులతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా మత్స్యకారుల రోజువారీ దినచర్య, చేపలవేట, అమ్మకాలు, కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొం టున్న సమస్యలు, చేపలు పడుతున్నప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. చేపల పెంపకం కోసం ప్రభుత్వం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లల్ని వదలడం జరిగిందన్నారు. జల ఆశయాలు చెరువులు కుంటల్లో నీరు ఉండడం వల్ల చేపల సంపద పెరిగిందని ఆయన చెప్పారు.
ఆదాయం పెంచుకునే మార్గం మెండుగా ఉన్న చేపల పెంపకంపై మత్స్యకారులు దృష్టి సారించాలని ఆయనకు కోరారు. అలాగే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మత్స్యకారులు లబ్ధి పొందాలని ఆయన సూచించారు.
గత ప్రభుత్వం పథకాల పేరిట రాష్ట్ర ఖజానను కొల్ల గొట్టిందని, గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్నదని వివరించారు.