calender_icon.png 5 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్‌మెంట్ ఇవ్వరా?

05-05-2025 01:04:41 AM

  1. బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తారా..
  2. 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
  3. యాజమాన్యాలు నిరసన తెలుపుతుంటే మొద్దనిద్ర
  4. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లు లు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించరా అని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  17 నెలల్లో 17 పైసలు కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతు న్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం తో 6లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందన్నారు.

డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పా లనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాం ధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగానిత నమే అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ప్రైవే టు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయా యని, కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. 

కేసీఆర్‌ది గొప్ప మనసు..

విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత సీఎం వైఎస్ ప్రా రంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుం డా కేసీఆర్ అమలు చేసి గొప్ప మనసు చాటుకున్నారని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆ ర్‌ఎస్ పాలనలో మొత్తం రూ.19,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేశామన్నారు.

యువ వికాసం పేరుతో ప్రతీ విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టినప్పటికీ దానికి అతీగతీ లేదన్నారు. ‘మాటమీద నిలబడేది లే దు.. ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు... సీఎం నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి..’ అని మండిపడ్డారు.

17 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు, డిగ్రీ కళాశాలకు, మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయని తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపా డాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.