27-09-2025 10:38:30 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి కల్పించే విధంగా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. హైదరాబాదులోని మల్లేపల్లిలో ఐదు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని, వీటితో పాటు రాష్ట్రంలోని 45 ఏటిసీలను ప్రారంభించారని అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏటీసీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటిఐ కాలేజీలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. సరైన శిక్షణ లేక విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోయారని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఇందులో విద్యతోపాటు వివిధ సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందిపుచ్చుకునే విధంగా కృషి చేస్తుందని చెప్పారు.
అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి సంవత్సరానికి మానుకోట నుంచి 170 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మానుకోటలో 63 కోట్ల రూపాయలతో ఏటీసీ సెంటర్ ను టాటా గ్రూప్ సహకారంతో ఏర్పాటు చేసిన ఏటీసీ శిక్షణ కేంద్రాలలో శిక్షణ పొందిన వారికి పక్కా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ లక్ష్యంగా ఏంటి సెంటర్లను ఏర్పాటు చేశామని అంతేకాకుండా ఏటీసీలో శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.