calender_icon.png 28 September, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌లో బతుకమ్మ సంబరాలు

27-09-2025 11:39:59 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, సాంప్రదాయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కమిషనరేట్‌కు చెందిన మహిళా సిబ్బంది, అధికారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లు  కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

కమిషనరేట్‌కు చెందిన మహిళా ఉద్యోగులు తమ తమ బతుకమ్మలను తీసుకువచ్చి, సాంప్రదాయ బతుకమ్మ పాటలతో, పూల అందాలతో ఉత్సాహంగా ఆడిపాడారు. అస్త్ర కన్వెన్షన్ హాలు బతుకమ్మలతో కళకళలాడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, "బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల గౌరవం, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీక. మహిళలు ఉద్యోగాల్లోనూ, కుటుంబాల్లోనూ సమానంగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పండుగలు మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతాయి" అని తెలిపారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, "బతుకమ్మ లాంటి పండగలు, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయి. సమాజానికి కూడా ఇవి ఒక స్ఫూర్తి" అని అన్నారు. ఉద్యోగులు కేవలం సేవలకే పరిమితం కాకుండా, సాంస్కృతిక విలువలను కాపాడుతూ పండుగను ఘనంగా జరపడం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి కిరీటమణి అని, ఈ పండుగలో ఉద్యోగులు, మహిళలు, సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకం అని ఆయన పేర్కొన్నారు.