calender_icon.png 24 May, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాల దందా

24-05-2025 01:22:10 AM

  1. అధిక దిగుబడులంటూ రైతులను నట్టేట ముంచుతున్న దళారులు
  2. సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం
  3. అధికారుల మొక్కుబడి తనిఖీలు

విజయక్రాంతి నెట్‌వర్క్, మే 23: వానాకాలం సాగు మొదలవకముందే రైతులకు నకిలీ విత్తనాల బెడద ఎదురవుతోంది. కొందరు దళారులు అమా యక రైతులనే లక్ష్యంగా చేసుకొని నాసిరకం విత్తనాలను అంటగడుతున్నారు. దళారుల మాటలు నమ్మి, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతన్న లు మోసపోతున్నారు. నకిలీ విత్తనాల రవాణాను కట్టడి చేయాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రపు దాడు లతో కొన్ని కేసులు నమోదు చేసి చేతు లు దులుపేసుకుంటున్నారు.

యేటా వానాకాలం సాగుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో వీటి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి. నకిలీ విత్తనాల వల్ల అన్నదాతలతో పాటు సేద్యరంగమే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సరైన పంట దిగుబడులు రాక ఇబ్బందులు పడుతున్న రైతన్నల పాలిట నకిలీ విత్తనాలు శరాఘాతమవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక రైతులే లక్ష్యంగా అధిక దిగుబడుల ఆశచూపి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైన కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు వెల్లువె త్తుతున్నాయి. 

మహారాష్ట్ర నుంచి రవాణా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో అమాయక రైతులే లక్ష్యంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువగా నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి.

నార్నూ ర్, జైనూర్ గాదిగూడ, బేలా, ఇచ్చోడ, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాణీ, కెరమెరి, వాంకిడి, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, బెజ్జూర్, బైంసా, కడెం తదితర మండలాల్లో జోరుగా నకిలీ పత్తి విత్తనాల దందా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ప లు ప్రాంతాల్లో దాడులు చేసి పెద్దఎత్తున నకి లీ విత్తనాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా మావల పీఎస్ పరిధి రామ్‌నగర్ కాలనీలోని ఓ గోదాంలో పెద్దఎత్తున నకిలీ విత్తనాలు నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న పోలీసులు రూ.10 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని, 8 మందిపై కేసు నమోదు చేశా రు. పెంచికల్‌పేట్ మండల శివారులోని బ్రి డ్జి సమీపంలో రూ.12 లక్షల విలువైన 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నా రు.

తాజాగా ఈ నెల 4న చింతలమానేపల్లి మండలంలో రూ.10.50 లక్షల విలువజేసే 300 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. వానాకాలం, యాసంగి సీజన్ల ఆరంభంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి.

ఎన్నికల మాదిరి ప్రచారం..

కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, లింగం పేట్, తాడ్వాయి, సదాశివ్‌నగర్, మాచారెడ్డి, భిక్కనూర్, రామారెడ్డి, రాజంపేట, పిట్లం, పెద్ద కొడప్‌గల్, నిజాంసాగర్, మద్నూర్ తదితర మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.

విత్తనా లు అమ్మే వ్యాపారుల దుకాణాలను సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉండగా, మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నా రు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు.. నకిలీ కంపెనీల విత్తనాల విక్రయాలు తమ దృష్టికి వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నకిలీ విత్తన విక్రేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది కూడా అనేక నకిలీ విత్తనాల లీలలు జిల్లాలో వెలుగు చూశాయి. అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో, ఎక్కువ ధరలు పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి, పం ట వేసిన రైతులకు నిరాశే మిగిలింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న విత్తనాలు వేయగా పంట ఏపుగా పెరిగినా, కంకులు మాత్రం సరిగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వానాకాలం, యాసంగి సీజన్ల ఆరంభాల్లో గ్రామాల్లో ఎన్నికల వాతావరణమే నెలకొంటుంది. మా కంపెనీ విత్తనాలు కొనాలంటే.. మా కంపెనీ విత్తనాలు కొనాలంటూ ఆయా నకిలీ విత్తనాల విక్రేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లోకి వచ్చి తమ విత్తనాలు వేస్తే అధిక దిగు బడు లు వస్తాయంటూ మైకుల్లో ప్రచారం చేస్తున్నారు.

గ్రామగ్రామాన రైతులకు అవగా హన సదస్సులు ఏర్పాటు చేయడమే కాకుం డా,వారికి మధ్యాహ్న భోజనమూ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద రైతులకు దావతులు కూడా ఇస్తున్నారు. పుట్టగొడుగుల్లా కంపెనీల పేర్లు చెబుతూ రైతులను గందర గోళానికి గురిచేస్తున్నారు. దీంతో ఏ కంపెనీ విత్తనాలు నాటాలో తెలియక రైతులు గందరగోళానికి గురవుతున్నారు.

గతేడాది నసు ర్లాబాద్‌లో ఏకంగా వందమంది రైతులు నకిలీ వరి విత్తనాలు విత్తి మోసపోయారు. సదరు డీలర్‌ను నిలదీయగా, తనకేమీ తెలియదంటూ బుకాయించడంతో లబోదిబో మన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, సో యా, పొద్దుతిరుగుడు, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలు అధికంగా సాగవుతుండగా, ఆయా పంటలకు సంబంధిం చిన నకిలీ విత్తనాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

సోయా, పత్తి నకిలీ విత్తనాల బెడద

సంగారెడ్డి జిల్లాలో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా సకాలంలో విత్తనాలు అందకపోవడంతో దీన్ని దళారులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా సోయా, పత్తి విత్తనాల బెడద అధికంగా ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డిలకు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి.

గత రెండు సీజన్లలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై సీడ్ యాక్ట్  కింద కేసులు నమోదు చేశారు. ప్రతీ సీజన్‌లో అధికారులు దాడు లు నిర్వహిస్తున్నప్పటికీ, కొంతమంది డీలర్లు అధిక డబ్బుకు ఆశపడి అమ్మకాలు చేస్తున్నారు. మార్కెట్లో గడ్డి మందును తట్టుకొనే పత్తి (హెర్బిసైడ్ టోలరెంట్) విత్తనాలు అ మ్మితే నేరమని, ప్రభుత్వ అనుమతి లేనందున అలాంటి విత్తనాలు అమ్మినా, రైతులు కొని పొలంలో విత్తినా చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గ్లెఫోసేట్ అనే గడ్డి మందును ఎవరైనా అమ్ముతున్న ట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. మెదక్ జిల్లాలో 80 శాతం వరి పంట పండించేందుకే ప్రాధాన్యమిస్తారు. 35 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి పంట పండిస్తున్నారు. జిల్లాలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట మం డలాల్లో పత్తి అధికంగా పండుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని, తనిఖీల ద్వారా కేసులు నమోదు చేసి అరికట్టేందుకు చర్యలు చేపడతామని మెదక్ జిల్లా వ్యవసాయాధికారి వినయ్‌కుమార్ వెల్లడించారు.

కాలం చెల్లిన వాటిని అంటగడుతూ..

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో కేటుగాళ్లు నకిలీ విత్తనాల దందాను జోరుగా సాగిస్తున్నారు. వివిధ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తూ రైతున్నలు నమ్మిస్తూ, వాటిని విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలు వేయడంతో పంట పండక రైతులు నట్టేట మునిగిన సందర్భాలు జోగులాంబ గద్వాల జిల్లాలో అనేకం ఉన్నాయి. అధిక లాభాలకు ఆశపడి డీలర్లు గుట్టుచప్పు డు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా కాలం చెల్లిన, నాసిరకం విత్తనా లు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి తదితర పంటలు ప్రధానంగా సాగవుతుండటంతో ఆయా పంటలకు సంబంధించిన నకి లీ విత్తనాలు జిల్లాలో విచ్చలవిడిగా చలామ ణి అవుతున్నాయి. కొంతమంది వ్యాపారులు ఏజెంట్లను పెట్టుకొని నేరుగా గ్రామా ల్లోకి వెళ్లి విత్తనాలు అమ్ముతున్నారు.

సీజన్ ఆరంభంలో విత్తనాల కొరత ఏర్పడుతుండటంతో దీన్నే అదునుగా భావించి దళారులు రంగంలోకి దిగుతున్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా అ మలు కావడం లేదు. తాజాగా జిల్లాలోని మ ల్దకల్ మండల పరిధిలో ఉన్న కుర్తి రావల గ్రామ సమీపంలో అధికారులు 12 క్వింటాళ్లకు పైగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ 

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ప్రతీ మండల కేంద్రంలో విత్తన, ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏడీఏలు, నేను కూడా జిల్లాలోని పలు దుకాణాలను విజిట్ చేసి, విత్తనాల నమూనాలు సేకరిస్తున్నాం. విత్తన ఎరువుల వ్యాపారులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిం చాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగో లు చేసినప్పుడు వ్యాపారుల నుంచి తప్పకుండా రసీదు పొందాలి.

 తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, కామారెడ్డి

రసీదు తప్పనిసరి  

విత్తనాలను కొనుగోలు చేయాలనుకుంటే లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దకే వెళ్లాలి. పేరుగాంచిన కంపెనీల విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. క్యూఆర్ కోడ్, ప్యాకింగ్ ఉన్న విత్తనాలను మాత్రమే వినియోగించాలి. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. కాసులకు కక్కుర్తి పడి డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయించి రైతుల పాపం మూటగట్టుకోవద్దు.      

సక్రియా నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, గద్వాల 

నష్ట పరిహారం పొందవచ్చు!

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు మొదలుకావడంతో రైతులు వానాకాలం పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుంది. దీంతో దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం మొదలుపెడుతుంటా రు. విత్తన సమయంలో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.

నకిలీ విత్తనా లను ఎంపిక చేసుకుని మోసపోవద్దని వ్యవసాయశాఖ అధికారు లు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా, కొందరు రైతులు నకిలీ విత్తన కంపెనీలు అందిస్తున్న  ఆకర్షణీయమైన లేబుళ్లు.. తక్కువ ధరకే వస్తున్నాయనే ఆశతో రైతులు  ఏటా మోసపోవడం పరిపాటిగా మారింది.

నాణ్యతలేని  విత్తనాలు మొలకెత్తకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడంతో వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతే.. ఆయా విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం పొందే వెసులుబాటు కూడా ఉందని, అందుకు ప్రభుత్వాలు చట్టాలను రూపొందించిన విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

అందుబాటులో నాణ్యమైన విత్తనాలు.. 

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 92,200క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రాష్ట్రవ్యాప్తంగా  రైతులకు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు వరి విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు, కంది-150క్వింటాళ్లు, పెసర-200క్వింటాళ్లు, మినుము-400 క్వింటాళ్లు, వేరుశ నగ -1,775 క్వింటాళ్లతో పాటు మిగతా పం టలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను కూడా రైతులకు తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ అందుబాటులో ఉంచింది. 

నష్టపరిహారం పొందాలంటే.. 

 నాణ్యతలేని నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే రైతు పరిహారం పొందే మార్గాలు ఉన్నాయి. విత్తనాల కోసం చెల్లించిన ధరకు సంబంధించిన రశీదు, విత్తనాలు ఉంచిన డబ్బా లేదా సంచి దాచి ఉంచాలి. విత్తనాల గురించి సమాచారం తెలుపుతూ ఇచ్చిన కాగితాలతో పాటు వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపర్చాలి.

పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత విత్తన డీలర్ లేదా కంపెనీ ప్రతినిధికి తెలియజేయాలి. నష్టపరిహారం కోసం కేసు వేసే లేదా దరఖాస్తు చేసుకునే అవకాశం రైతుకు ఉంది. దీంతో విత్తనాల కోసం చెల్లించిన ధర, సాగు ఖర్చు, తగ్గిన దిగుబడి విలువతో రైతుకు కలిగిన మానసిక క్షోభకు కూడా పరిహారం పొందే అవకాశం ఉంది. 

నష్టపరిహారం పొందే మార్గాలు.. 

* పరిహారం పొందడానికి రైతుకు హక్కు ఉంటుంది

* వినియోగదారుల చట్టం కింద జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో కేసు వేయవచ్చు

* సివిల్ కోర్టులో కేసు దాఖలు  చేయవచ్చు 

* పత్తి విత్తనాల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు 

* రిజిస్టర్ అయినా కొత్త వంగడాలలో నాణ్యత లోపం ఉంటే.. రైతు హక్కుల చట్టం కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు.  

అమల్లో ఉన్న చట్టాలు.. 

నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా గత ప్రభుత్వాలు పలు రకాల విత్తన చట్టాలను తీసుకొచ్చాయి. ఆ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 

* అభివృద్ధి చేసిన విత్తనాలు లేదా మొలకల చట్టం-1951

* విత్తనాల చట్టం-1966 

* కొత్త వంగడాల రక్షణ, రైతు హక్కుల చట్టం-2001

* పత్తి విత్తనాల చట్టం-2007