24-05-2025 01:26:26 AM
అవును.. ఆ లేఖ నేనే రాశా
రాజేంద్రనగర్, మే 23: బీఆర్‌ఎస్‌లో కలకలం రేపిన లేఖను తానే రాసినట్టు గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టతనిచ్చారు. కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల క్రితమే తాను బీఆర్‌ఎస్ అధినేత, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అంతర్గతంగా లేఖ రాశానని, కొందరు కోవర్టులు దానిని బహిర్గతం చేశారని కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమెరికా నుంచి ఆమె శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి తన భర్త అనిల్, ఇద్దరు కుమారులతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడి యాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో పార్టీ నిర్వహించిన బహిరంగ సభ తర్వాత రాసిన ఆ లేఖలో వెల్లడించిన అభిప్రాయాలు తన వ్యక్తిగతమైనవి కావని స్పష్టం చేశారు. అందులో క్షేత్రస్థాయిలోని కార్యకర్తల మనోభావాలనూ తెలియజేశానని వివరించారు.
అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో తనకు తెలియదని, కొందరు కోవర్టులు తను అమెరికా పర్యటనలో ఉన్నపుడు ఉద్దేశ పూర్వకంగా దానిని బయటపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ దేవుడు లాంటి నాయకుడని, ఆయన చు ట్టూ కొందరు దయ్యాల లాంటి కో వర్టులు ఉన్నారని ఆరోపించారు. తనకు వ్యక్తిగత ఎజెండా ఏమాత్రం లేదని కవిత స్పష్టం చేశారు. పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని, తాను గతంలోనే ఈ చెప్పా నని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు కార్యకర్తలతో పాటు, సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విష యాలన్నీ తాను లేఖలో వెల్లడించినట్లు కవిత స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గతంగా తమ నాయకుడికి రాసిన లేక బహిర్గతం ఎలా అయిందని, ఇది కుట్రకోణాన్ని చెబుతుంద న్నారు. పార్టీ, కుటుంబం ఐక్యంగానే ఉన్నట్టు ఆమె చెప్పారు.
పార్టీలో చిన్నచిన్న లోపాలను చర్చించుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీలోని కోవర్టులను పక్కకు తప్పిస్తేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యనించా రు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ముందుకు వెళితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. తన లేఖ లీక్‌ను బట్టి పార్టీలో పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందని చె ప్పారు. తన లేఖపై కాంగ్రెస్, బీజేపీ సంబరపడాల్సిన అవసరం లేదని కవిత అన్నారు.
కనిపించని గులాబీ జెండాలు
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి వస్తున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం లో కార్యకర్తలు అభిమానులు నాయకులు ఎక్కడా బీఆర్‌ఎస్ జండాలను ప్రదర్శించకపోవడం గమనా ర్హం. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ ప్లకార్డులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అయితే కవితకు స్వాగతం పలికేందుకు వేలాదిసంఖ్యలో ఆమె అభిమానులు, నాయకులు శంషాబాద్ విమానాశ్రయానికి తరలి వచ్చారు.