24-05-2025 02:07:11 AM
-త్వరలో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ అంటున్న మంత్రి పొన్నం
- కానీ ఔట్‌సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టులకు ఆహ్వానం!
- భర్తీ ఒట్టిమాటేనని కార్మిక సంఘాల ఆరోపణ
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ‘త్వరలో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ’.. ఇది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న మాట. మూణ్నెళ్లకోసారి ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. దీంతో పనిభారం తగ్గుతుందని ఆర్టీసీ కార్మికుల్లో, కొత్త ఉద్యోగాలకు ప్రకటనలు రాబోతున్నాయంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ కొత్త నియామకాల మాట అటుంచితే ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు ఈ నెల 8వ తేదీన బస్‌భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఔట్ సోర్సింగ్ కండక్టర్లకు నెలకు రూ.17,969 వేతనం చెల్లించాలని కూడా ఈ సర్క్యులర్‌లో ఉంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ఉద్యోగులను నియమించుకోవాలని బస్‌భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అందుకోసమేనా ఊరింపు..
ఔట్ సోర్సింగ్ కండక్టర్ల నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవటంపై అటు కార్మిక సంఘాలు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతూ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ అంశంపై స్పష్టతనివ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీని ఆగం చేసేందుకే ఎప్పుడు లేని విధంగా కండక్టర్ల ఔట్ సోర్సింగ్ విధానానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని యూనియన్లు మండిపడుతున్నాయి.
వెల్ఫేర్ కమిటీలెందుకు?
ఈ నెల 27న హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డ్ మీటింగ్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌పైనా ఆర్టీసీ జేఏసీ మండిపడింది. సమ్మె వాయిదా వేసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టుగా ఉందని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లకు గుర్తిం పునివ్వకుండా వెల్ఫేర్ కమిటీలంటే ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయ త్నం జరుగుతున్నట్టుగా తాము భావిస్తున్నట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.