24-05-2025 01:07:38 AM
‘రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్’లో గౌతమ్ అదానీ ప్రకటన
న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ, రోడ్లు, హైవేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలు లక్ష్యంగా చేసుకొని రాబోయే పదేళ్లలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్’లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ ప్రకటన చేశారు. గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. గత దశాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉందని, అక్కడి వైవిధ్యం, వనరులను సరైన రీతిలో వాడుకోలేకపోయామన్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో అదానీ గ్రూప్ ఈశాన్య రాష్ట్రాల్లో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే గత నెలలో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో ఒక్క అస్సాం రాష్ట్రంలోనే 50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమ్ అదానీ మరో 50 వేల కోట్లు ప్రకటించడంతో మొత్తంగా లక్ష కోట్ల పెట్టుబడులతో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల్లో మౌళిక సదుపాయాల ఆధారిత వృద్ధిని, ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి ఇది ఎంతగానో దోహదపడనుంది.