26-11-2025 12:00:00 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 25 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మంగళవారం భువనగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చిన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
తదుపరి కార్యాలయంలో ఉన్న ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ శోభారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.