21 August, 2026 | 6:08 AM

రెండేండ్లుగా తరగతుల బోధన నిల్...

21-08-2026 01:47 AM

జరగని తరగతులకు పరీక్షలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

మంచిర్యాల, ఆగస్టు 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ విద్యార్థుల విద్యా బోధనకు సంబంధించి తీవ్రమైన నిర్లక్ష్యం జరుగుతోందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. గత రెండు విద్యా సంవత్సరాలుగా పీజీ విద్యార్థులకు సక్రమంగా తరగ తులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు వారు చదివే కోర్సులలో సెలబస్ కూడా ఏముందో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం ఈ నెల 20వ తేదీ నుంచి 31 తేదీ వరకు పీజీ మొదటి సం వత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ను ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందో ళన మరింత రెట్టింపైంది. యూనివర్సిటీ నుంచి పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన సమయంలోనైనా తరగతులు నిర్వహించకపోవడంతో సిలబస్పు అవగాహన, సందేహాల నివృత్తి, పునశ్చరణ, పరీక్షా మార్గదర్శకత్వం వంటి అంశాల్లో విద్యార్థులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.

తరగతుల బోధన రెండేండ్లుగా నిల్...

పీజీ కళాశాలలో గడిచిన రెండు సంవత్సరాలుగా తరగతుల బోధన సాగడం లేదు. ఏడాది కిందట ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష నిర్వహించగా బ్యాచ్ కు బ్యాచ్ నష్టపోయినా యాజమాన్యంలో మార్పు రావడం లేదు. అధ్యాపకులను నియమించుడు లేదు.., తరగతులు నిర్వహించుడూ లేదు.. రెండేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు సైతం ఆరోపిస్తున్నారు.

పీజీ కో ర్సులో చేరిన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం, నిర్ణీత సిలబస్ను పూర్తిచేయడం, క్రమం తప్పకుండా తరగతులు నిర్వ హించడం కళాశాల పరిపాలన, సంబంధిత బోధనా సిబ్బంది బాధ్యత, కాని కళాశాలల్లో జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల విద్యా ప్రగతి, పరీక్షా ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.

టైం టేబుల్ వచ్చినా పట్టింపు లేదు...

పరీక్షల టైంటేబుల్ ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ విద్యార్థులకు అవసరమైన అకాడమిక్ సహాయం అందకపోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కళాశాల పరిపాలనా పర్యవేక్షణ లోపమా..? లేక తరగతుల నిర్వహణపై తగిన శ్రద్ధ లేకపోవడమా...? అనే అంశంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చే యాలని విద్యార్థులు కోరుతున్నారు.

కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే కళాశాలను పరిశీలించి, రెండు సంవత్సరాల్లో పీజీ తరగతుల నిర్వహణ, టైంటేబుల్స్, హాజరు రిజి స్టర్లు, సిలబస్ పూర్తిచేసిన వివరాలు, అకాడమిక్ రికార్డులను పరిశీలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మిగిలిన తరగతులను సక్రమంగా నిర్వహించడంతో పాటు పరీక్షలకు అవసరమైన పునశ్చరణ తరగతులు, విద్యా మార్గదర్శకత్వం అందించాలని కోరుతున్నారు.