11-10-2025 01:06:07 AM
వనపర్తి,(విజయక్రాంతి): పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పార్టీ పాలనలో ప్రజలను మోసం చేసి కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా ఆర్జించిన మీరు తెలంగాణ ప్రజలకు మీ చర్మంతో చెప్పులు కుట్టించిన తప్పులేదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని రైతు వేదికలో పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ రైతువేదికలో వ్యవసాయ శాఖ తరపున ఏర్పాటు ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో వేరువేరుగా ఎమ్మెల్యే పాల్గొన్ని రైతులకు వేరుశనగ విత్తనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రైతులకు అందజేయవలసిన రాయితీ పనిముట్లను, రాయితీ విత్తనాలను, రాయితీ ఎరువులను, రాయితీపై స్పిన్క్లర్లను, రాయితీపై డ్రిప్ పైపులను, రాయితీపై అందించే యాంత్రికరణ తోపాటు ఇంకా అనేక వాటిని పూర్తిగా బందు పెట్టి కేవలం రైతుబంధు పేరుతో రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వనపర్తిలో భూకబ్జాలు చేసి చెరువు కట్టల పేరున అభివృద్ధి మాటున రూ. 400 కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన వ్యక్తులకు బాకీ కార్డులు పట్టుకొని తిరిగే అర్హత ఎక్కడిదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
మొదటి నుంచి రైతులని ఆదుకున్నది ఇందిరమ్మ ప్రభుత్వమేనని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాలువలు తవ్వి సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన కాలేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి ఒక్క ఎకరానికి కూడా నేటికి నీళ్లు అందివ్వలేదని ఆయన విమర్శించారు. గతంలో తవ్విన కాలువలతోనే నేటికీ పాలమూరు సస్యశ్యామలంగా ఉందని, కేవలం డబ్బు సంపాదించాలనే నెపంతోనే ప్రాజెక్టులను వాడుకున్నారే తప్ప సాగునీరు అందించిన పాపాన పోలేదన్నారు. నేడు వనపర్తి లో ఓ వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిందని కార్డులు ముద్రించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడన్నారు.
కొత్తగా జిల్లా ఏర్పాటయినాడు నిర్మించుకున్న ఎస్పీ కార్యాలయం మెడికల్ కళాశాల రోడ్ల వెడల్పు లాంటి అనేక పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.400 కోట్ల బాకీ పడ్డ సన్నాసులు నేడు బాకీ కార్డులు పట్టుకుని తిరగడం హాస్యాస్పదం అని విమర్శించారు. పెబ్బేరు పట్టణంలో సంత దోచుకునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తులు, గుమ్మడం గ్రామంలో పాఠశాల పరిసరాల్లో ఉన్న మూడు ఎకరాలను కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించిన నాయకులు నేటికీ ప్రజలకు బాకీ పడి ఉన్నారని ఆ బాకీలు తీర్చి ప్రజల్లో బాకీ కార్డు ప్రదర్శిస్తే సంతోషిస్తామని ఆయన అన్నారు.
పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పదవిలో ఉన్నంతకాలం పాలమూరు అభివృద్ధికి పాటుబడతానని అందుకు కావలసిన నిధులను ప్రతి ఏటా రూ 25 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మనకందరికీ అండగా ఉందని కాంగ్రెస్ పార్టీ తోనే నేడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీలాంటి అనేక కార్యక్రమాలు నిరుపేదలకు అందుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వేరుశనగ పంట సాగు చేసుకునే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి మొత్తం 2500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఇందులో మొదటి విడుదల 890 క్వింటాలను నేడు అధికారులు అన్నదాతలకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికలు ఏ సందర్భంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం సాధిస్తుందని దగాకో ర్ ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు.