calender_icon.png 4 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి యువతకు స్ఫూర్తి గుంటక నరసయ్య పంతులు సేవలు

04-10-2025 12:15:22 AM

కేయూ రిటైర్డ్ ప్రోఫెసర్ గడ్డం భాస్కర్ 

హనుమకొండ, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, కవి గుంటక నరసయ్య పంతులు ఉద్యమ నేపథ్యం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని ఓబీసీ జనరల్ సెక్రెటరీ ఆచార్య గడ్డం భాస్కర్ కొనియాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సమాజ హిత సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. నరసయ్య పంతులు 122వ జయంతి వేడుకలను ఓబీసీ హనుమకొండ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు.

బీసీ చేనేత వర్గానికి చెందిన ఈ నాయకుడి చరిత్రను నేటి యువతకు స్ఫూర్తిగా అందించాలనే సంకల్పంతో ఈ వేడుకలను నిర్వహించామని తెలిపారు. నరసయ్య పంతులు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి, ఖాదీ ఉద్యమానికి మరియు చేనేత ఉద్యమానికి ఎనలేని కృషి చేశారన్నారు. చేనేత పారిశ్రామికుల కోసం సహకార సంఘాలను బలోపేతం చేశారని, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ను తన అధ్యక్షతన ఏర్పాటు చేసి, డెక్కన్ చరక సొసైటీ స్థాపించి పారిశ్రామికులకు ఉపాధి కల్పించార న్నారు.. ఆయన స్థాపించిన ’స్వదేశీ ఖాదీ వస్త్రాలయం’ నేటికీ కోఠి బజారులో ఆయన వారసులచే నడపబడుతోంది అని, పద్మశాలి కులంలో జన్మించిన నరసయ్య పంతులు పద్మశాలి సమాజ వికాసానికి, చేనేత ఉద్యమానికి, విద్యారంగానికి నిరంతరం పాటుపడిన మహోన్నత భావాలు గల వ్యక్తి అని కొనియాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంతో పాటు, తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలన ఉద్యమంలో, అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి కొండంత అండగా నిలిచారు. ప్రతి ఉద్యమ కార్యక్రమంలో బాపూజీకి చేదోడు వాదోడుగా ఉంటూ, కింగ్ మేకర్గా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. పద్మశాలి ప్రతిభను సమాజ సేవకు వినియోగించుకోవాలని లోతైన అధ్యయనం చేసిన పంతులు ’భృగ్వాదుల ప్రభావం అను గ్రంథం’ రచించి కుల బంధువులను ఏకతాటిపైకి నడిపించారు. ఆయన అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా యువతను ఏకం చేశారు. ఇతర రాష్ట్రాలకు (ముంబై, సోలాపూర్, సూరత్ వంటి నగరాలు) ఉపాధి కోసం వలస వెళ్లిన తెలుగువారి కోసం తెలుగు మీడియం పాఠశాలలను స్థాపించారు.

పేద, మధ్యతరగతి పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత పదవుల్లో రాణించాలని ఉద్దేశంతో వసతి గృహాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం శాశ్వత నిధి ఏర్పాటు చేసి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించిన మొట్టమొదటి దానకర్త ఆయనే అని భాస్కర్ పేర్కొన్నారు. తన జీవిత కాలంలో చేసిన సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా నరసయ్య పంతులుని యువక  కిషోర మణి, ’చేనేత ఉద్యమ పితామహ’ వంటి బిరుదులు వరించాయి. ఆయన చరిత్రను ఒక పాఠ్యాంశంగా పరిగణించి, నేటి తరం భవిష్యత్ తరాలకు భరోసానిచ్చే విధంగా మెలగాలని ఓబీసీ కోరుకుంటుంది.

ఈ కార్యక్రమంలో ఓబీసీ బాధ్యులు జాయింట్ సెక్రెటరీ  గంగపురం వేణుమాధవ్, మాట్లాడుతూ నరసయ్య పంతులు ఆర్థిక విధానాలు చేనేత కార్మికుల భవిష్యత్తుకు మూలంగా పేర్కొన్నాడు ఆయన చేసిన సేవలు కొండా లక్ష్మణ్ బాపూజీ కి ప్రత్యేకమైన గుర్తింపును అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మరొక జాయింట్ సెక్రెటరీ ఎం ఎం మూర్తి, ఓబిసి సభ్యులైన గుండేటి చక్రపాణి, తుమ్మ శ్రీనివాస్,రాజు యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.