calender_icon.png 21 September, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుడుగట్టిన దొంగలు అరెస్టు

21-09-2025 12:00:00 AM

27 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ, 3 లక్షల నగదు, కారు స్వాధీనం 

హయత్ నగర్ పోలీసులను అభినందించిన సీపీ సుధీర్‌బాబు

ఎల్బీనగర్, సెప్టెంబర్ 20 : కరుడుగట్టిన ముగ్గురు దొంగలను హయత్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో ఇండ్లలో చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి చోరీ చేసిన 27 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ, 3 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామ్ నాయక్ తండా కు చెందిన మండల శివ(32) కర్మన్ ఘాట్ లోని కాకతీయ నగర్ లో కూలీగా పని చేస్తున్నాడు. యల్లా బాలకృష్ణ(35) బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్య నగర్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మోత్కూర్ శ్రీకాంత్ (35) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. వీరిలో శివ పాత నేరస్తుడు.

ఇతను జైలులో ఉన్నప్పుడు బాలకృష్ణతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి శ్రీకాంత్ స్నేహితుడు. మూడు నెలల క్రితం శివ ఒక కేసులో చర్లపల్లి జైలు నుంచి బెయ్పి విడుదలై హయత్న గర్లోని బంజారా కాలనీలో ఉంటున్న వదిన ఇంట్లోనే ఉంటూ కూలీ పని చేసుకుంటు న్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని, చోరీ చేసే సమయంలో తప్పించుకోవడానికి కారు అవసరమని గుర్తించి బాలకృష్ణను సంప్రదించాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకా రం ఈ నెల 6న కారులో బంజారా కాలనీ సమీపంలోని ఆర్టీసీ మజ్దూర్ నగర్ కాలనీకి వెళ్లారు. శివ తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి, తాళం పగలగొట్టి, లోపలికి ప్రవేశిం చి, వెండి, బంగారు ఆభరణా లను దొంగిలించి కారు లో అక్కడి నుంచి పారిపోయా రు. దీనిపై బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తరువాత 13వ తేదీ రాత్రి సమయంలో మునగనూరులోని జయసూర్య నగర్‌లో ఉన్న ఇంట్లో దాదాపు 33 తులాల బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేసి, కారులో పారిపోయారు.

చోరీ చేసిన ఆభరణాలను విక్రయించడానికి 15న స్నేహితుడు శ్రీకాంత్ సాయం తో ఎల్బీ నగర్లోని అట్టికా గోల్ షాపులో విక్రయించారు. శివపై గతంలో వనస్థలిపురం, సరూర్ నగర్, మీర్ పేట, అమీన్ పూర్, అచ్చంపేట పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారంతో హయత్ నగర్ పోలీసులు భాగ్యలత కమాన్ దగ్గర ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు. కేసును ఛేదించిన హయత్ నగర్ పోలీసులను సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తదితరులు అభినందించారు.