21-09-2025 12:00:00 AM
తెలంగాణ హై కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ జి.రాధారాణి
ముషీరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): అమ్మాయిలు తన కాళ్లపై తాము నిలబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి ప్రధానమైన ఆయుధం చదువేనని తెలంగాణ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ జి.రాధా రాణి అన్నారు. తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో బాలికా సాధికారికత బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్బంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు బాలిక సాధికారతపై స్క్రిప్టులు గీతాలాపన నృత్య ప్రదర్శనలు చేసి అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ హై కోర్ట్ రిటైర్డ్ జడ్జ్, జస్టిస్ జి. రాధా రాణి, సినిగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, విజ్ఞాన దర్శిని అధ్యక్షులు టి. రమేష్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి డాక్టర్ లావణ్య పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ జి. రాధా రాణి మాట్లాడుతూ అమ్మాయిలు చట్టాలను, తమ హక్కులను ఉపయోగించుకొని ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలంటే చదువు ప్రధానమైన ఆయుధమని అన్నారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, మలాలా యూసుఫ్ జాయ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వయం సాధికారత సాధించడానికి నేటి అమ్మాయిలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఉమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ అమ్మాయిలు చిన్నప్పటి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సమస్యలకు మూలం ఇంటి పరిస్థితుల్లోనే ఉంటుందని అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ నేటి అమ్మాయిలు తమ కాళ్ళపై తాము ధైర్యంగా ఎదగాలంటే, ఎవరికివారు సాధికారతను సాధించాలంటే అన్నిటికంటే ముందు మీతో మాట్లాడుతున్న ఎదుటివారిని గమనించాలని వారి చూపు, వారి, పిలుపు, ప్రేమ ఆప్యాయతను కనబరుస్తుందా, ఆకలిని కనబరుస్తుందా గమనించాలన్నారు.
వెంటనే మీరు మీ కాళ్లను చేతులను ఆయుధాలుగా మార్చాలని సూచించారు. విజ్ఞాన దర్శిని అధ్యక్షులు టి. రమేష్ మాట్లాడుతూ నేటి చదువులు మూఢనమ్మకాల్లో నెట్టేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్టు శైలజ, సుజావతి, అంకమ్మ, సౌదామిని, వంగపల్లి పద్మ, రజిత, తెలంగాణ బాలస్వామి ప్రధాన కార్యదర్శి ఎన్. సోమయ్య, ఆఫీస్ కార్యదర్శి, పి.ఎన్.కె బ్రాహ్మణి, మహేష్ దుర్గే, సాజిదా ఫాతిమా, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.