calender_icon.png 10 September, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావు బీఆర్‌ఎస్ సంపద

04-09-2025 01:08:53 AM

-ఆయన్ను బలహీనపరిచే వ్యాఖ్యలు తెలంగాణకే నష్టం

-గతంలో పొగిడినవారే ఇప్పుడు ఆరోపణలు

-మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి హరీశ్‌రావు సంపద లాంటి వ్యక్తి అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన్ను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ నేతలు అజమ్ అలీ, ఇంతియాజ్ ఇసాక్‌లతో కలిసి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీశ్‌రావు అని చెప్పారు.

నాడు హరీశ్‌రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తి పోతల మీద శాసనసభలో హరీశ్‌రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారని, కానీ కొందరు హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణను ప్రేమించే వాళ్లు బీఆర్‌ఎస్‌కు రక్షణ కవచంగా ఉండాల్సిన తరుణంలో, కుట్రలను చీల్చి చెండాడాల్సింది పోయి ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా ద్రోహపాత్రగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు.

హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కారంటూ ఆరోపించడం అర్థరహితమని, భవిష్యత్‌లో కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఇలాగే ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. వారికి కష్టం వచ్చినప్పుడు పార్టీ అండగా నిలబడిందని గుర్తు చేశారు. హరీశ్‌రావు మీద ఆరోపణలు చేయడం మూలంగా ఎవరికి లాభం చేకూరుస్తున్నారని ప్రశ్నించారు. సంతోష్‌రావు ఎన్నడూ ప్రభుత్వంలో లేరని, ఆయన ఎక్కువగా కేసీఆర్ సహాయకుడిగానే ఉన్నారని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ను కాదని పార్టీలో ఇంకెవరూ పాత్ర పోషించే పరిస్థితి ఉండదని, పార్టీలో ఎవరైనా కేసీఆర్ ఇచ్చిన పాత్రనే పోషించాలన్నారు. రేవంత్‌రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు పాలమూరుకు కనీసం యూరియా కూడా లేకుండా పోయారని, ఉన్న టెండర్లు రద్దు చేసి కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం మీద వేసింది ఒక లొట్ట పీసు కమిషన్, అది ఒక లొట్ట పీసు నివేదిక అని, స్థానిక సంస్థ ల ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మీద బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాగునీళ్లు ఆంధ్రాకు తరలించి, తెలంగాణను కక్ష రాజకీయాలకు పరిమితం చేయాలన్న భావనతో రేవంత్ ఉన్నట్టు అర్ధ మవుతుందన్నారు.