దేశాన్ని నలుగురు గుజరాతీలు దోచేస్తున్నారు

27-04-2024 01:45:19 AM

l బీజేపీకి అధికారమిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు

l ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు తొలగిస్తారు

l జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): బ్రిటీష్ పాలకుల తరహాలో గుజరాత్‌కు చెందిన నలుగురు దేశాన్ని దోపిడీ చేసేందు వచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. గుజరాత్‌కు చెందిన ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షా దేశ సంపదను దోచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒక్కటేనని, కేసీఆర్ చెప్పిన వ్యక్తులకే కాషాయ పార్టీ ఎంపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు.

విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికంగా అభివృద్ది చేన్తున్నామన్నారు. ఇందిరమ్మ మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో పారిశ్రమలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 16 నెలలు ఢిల్లీలో ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందని, అన్నదాతలకు మోదీ క్షమపణ చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక చట్టాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. దేశంలో బ్రిటీష్ జనతా పాలన సాగుతుందన్నారు. కులమతాల విబేధాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. 75 సంవత్సరాల తరువాత దేశంలో మోదీ, అమిత్ షా, అంబానీ, ఆదానీ ప్రజల సోమ్మును దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 

హామీలన్నీ అమలు చేస్తాం.. 

రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని అమోదించామన్నారు. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, వాటికి రూ.2,500 కోట్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అన్నారు. రాష్ట్రంలో ఉచితంగా 40 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు కరెంట్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందకు కృషి చేస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు.

1,200 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ తెలంగాణ వనరులు దోపిడీ చేశారని ఆరోపించారు. సోనియమ్మ అశీర్వాదంతో వచ్చిన తెలంగాణను దొరలు దోపిడీ చేస్తే, గడీలు బద్దలుకొట్టామన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మాదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.