20-09-2025 01:07:57 AM
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహిస్తే సంసారంలా కనిపించిందని, ఇప్పుడు ఇతరులు చేస్తే మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యభిచారంలా కనిపిస్తోందా అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అధికారంలో ఉన్న పదేండ్లలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకొని, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
అందులో ఏ ఒక్కరితోనూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. రాష్ర్టంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌కు అప్పు డు లేని విలువలు ఇప్పుడే గుర్తుకు వచ్చా యా అని ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. స్పీకర్ మా అందరికీ నోటీసులు ఇచ్చారని, ఈ నెల ఆఖరు వరకు స్పీకర్‌కు వివరణ పంపిస్తానని తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.