calender_icon.png 11 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సొమ్ముతో హెచ్‌సీఏ ఆటలు

11-07-2025 12:10:09 AM

- క్రికెట్ అభివృద్ధికి వాడకుండా నిధుల దుర్వినియోగం

- బయటపడిన పాలక మండలి బాగోతం

- గురువారెడ్డి ఫిర్యాదుతో కదిలిన డొంక

- ప్రతివాదుల అడ్వకేట్‌కు హెచ్‌సీఏ నిధుల మళ్లింపు

- సీఐడీ విచారణలో బహిర్గతమైన అవినీతి

- హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుకు రిమాండ్

- సీఐడీ అదుపులో బోర్డు సభ్యులు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): క్రికెట్ ప్రపంచాన్ని భారతదేశం శాసిస్తుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మాత్రం వివాదాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అనినీతి ఆరోపణలు ఒక పక్క.. టికెట్ల విక్రయ వివాదం మరోపక్క.. మొత్తంగా హెచ్‌సీఏ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారిపోతున్నది. అభివృద్ధి, సాంకేతికత, సంక్షేమానికి కేంద్రంగా తెలంగాణ నిలుస్తున్న తరుణంగా క్రీడాప్రపంచం ముందు రాష్ట్రం తలదించుకునేలా హెచ్‌సీఏ వ్యవ హరిస్తున్నది.

జాతీయ, అంతర్జాతీయంగా క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా తెలంగాణ లోనూ క్రికెట్ బోర్డును అభివృద్ధి చేసి యువతకు అవకాశాలు కల్పించాల్సిందిపోయి నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నది. క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న యువత, ఫ్రాంఛైజీలు, క్రీడాభిమానులకు నిరాశ మిగులుస్తున్నది. హెచ్ సీఏలో ఫోర్జరీ సంతకాలు, టికెట్ల విక్రయంలో వివాదం వంటి అంశాలు రాష్ట్రం లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు టికెట్ల విక్రయం వివాదంతో మొదలైన హెచ్‌సీఏ వ్యవహారం ప్రస్తుతం అరెస్టుల వరకు వచ్చింది. హెచ్‌సీఏలో జరిగిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 

అసలేం జరిగింది..

ఈ వివాదం ఐపీఎల్ సమయం లో హైదరాబాద్‌లో జరిగిన సన్‌రైజర్స్‌హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టీబీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. హెచ్‌సీఏ అధికారులు అదనంగా ఉచిత టికెట్లు కోరారని ఆరోపిం చారు. బెదిరింపులు, వేధింపుల విషయాలను బయటపెట్టారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎస్‌ఆర్‌హెచ్ స్టేడియంలోని 10 శాతం టికెట్లను హెచ్‌సీఏకు ఉచితంగా కేటాయిస్తుంది. అయితే హెచ్‌సీఏ కార్యదర్శి మరో 10 శాతం టికెట్లను అదనంగా కోరారని, అలాగే అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తన వ్యక్తిగతంగా కూడా 10 శాతం టికెట్లను డిమాండ్ చేశారని ఎస్‌ఆర్‌హెచ్ వర్గాలు ఆరోపించాయి.

గురువారెడ్డి ఫిర్యాదుతో బయటపడిన బాగోతం..

నిధులు దుర్వినియోగం చేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవోను అరెస్టు చేసింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్‌యాదవ్, అతడి భార్య కవితను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా ఫోర్జరీ సంతకాల బాగోతం బయటపడింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో నకిలీ పత్రాలు సమర్పించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన కవిత ఫోర్జరీ చేశారు. వీటిని జగన్‌మోహన్‌రావుకు అందించారని అధికారులు నిగ్గుతేల్చారు. నకిలీ పత్రాలతో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు ఎన్నికైనట్టు బయటపడింది. 

రిమాండ్‌కు జగన్‌మోహన్‌రావు..

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్‌మోహన్‌రావును అరెస్టు చేసినట్టు గురువారం ఉదయం ప్రకటించిన సీఐడీ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్టు సీఐడీ ప్రకటించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 

ప్రతివాదుల అడ్వకేట్‌కు హెచ్‌సీఏ నిధులు..

సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసులో ప్రతివాదుల అడ్వకేట్‌కు హెచ్‌సీఏ నిధులను చెల్లించింది. వాస్తవానికి హెచ్‌సీఏ వ్యతిరేకంగా పిటిషనర్‌గా ఉన్న బడ్డింగ్ స్టార్స్ సీసీ తరఫున బీ శ్రవంత్ శంకర్ అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ సీఐడీ దర్యాప్తులో బడ్డింగ్ స్టార్స్ సీసీ అడ్వకేట్‌కు హెచ్‌సీఏ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపులు జరగాయని ఆధారాలు బయటపడ్డాయి. దీంతో కోర్టు సమయాన్ని వృథా చేయడమేకాక కుట్రపూరితంగానే నిధుల దుర్విని యోగం జరిగిందని స్పష్టమవుతున్నది.

రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన నిధులను హెచ్‌సీఏ పాలకమండలి దుర్వినియోగానికి పాల్పడుతోంది. తాజా అరెస్టులతోపాటు విజిలెన్స్ నివేదికను ప్రాతిపదికగా తీసుకొని, రాష్ర్ట ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్‌సీఏలోని పాలనా లోపాలు, వ్యవస్థాపిత అవినీతిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

సీఎం ఆదేశాలతో విజిలెన్స్ విచారణ

ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలో హెచ్‌సీఏ అధ్యక్షుడు సహా ఇతర అధికారులపై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచుల సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని జగన్‌మోహన్‌రావు తీవ్ర ఇబ్బం దులకు గురిచేసినట్టు సీఐడీ గుర్తించింది.

టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో అమ్మడం, ఆర్థిక కుంభకోణాలు, అక్రమంగా సంఘం ఖాతాల్లోని నిధులను విత్‌డ్రా చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. ఇందులో భాగంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును సీఐడీ అరెస్టు చేసింది. ఆయనతోపాటు హెచ్‌సీఏ పాలక మండలిని మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నది. 

మ్యాచ్‌కు అడ్డంకులు.. గ్యాలరీలకు తాళం

2025 మార్చి 27న లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు వీఐపీ గ్యాలరీలకు తాళం వేశారు. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ యాజమాన్యం నిరసనకు కారణమైంది. సదరు వీఐపీ బాక్స్ లక్నో యజమా ని సంజీవ్ గోయెంకాకు కేటాయించినదిగా ఎస్‌ఆర్‌హెచ్ స్పష్టం చేసింది. దీంతో తీవ్రంగా స్పందించిన ఎస్‌ఆర్‌హెచ్ టికెట్ల పేరుతో హెచ్‌సీఏ బ్లాక్‌మెయిల్ చేస్తోందని, భవిష్యత్‌లో హైదరాబాద్ నుంచి ఐపీఎల్ మ్యాచులు తరలించవచ్చనే విషయాలను ప్రస్తావించింది. తమ హోంగ్రౌండ్‌ను మరో చోటుకు మారుస్తామని హెచ్చరించింది.