హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం రూ.3,986 కోట్లు

27-04-2024 12:20:00 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో మూడవ పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలానికి సంపాదించిన రూ.3,983 కోట్ల నికరలాభంతో పోలిస్తే వృద్ధి దాదాపు ఫ్లాట్‌గా ఉన్నది. కంపెనీ ఆదాయం మాత్రం 7.1 శాతం పెరిగి రూ.26,606 కోట్ల నుంచి రూ.28,499 కోట్లకు చేరింది. యూఎస్ డాలర్ల రూపంలో తమ రెవిన్యూ 5.4 శాతం పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్ సీఈవో, ఎండీ విజయ్‌కుమార్ తెలిపారు.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అడాప్షన్‌తో మాత్రమే అంతర్జాతీయ సంస్థలు టెక్నాలజీ వ్యయాల్ని పెంచుతాయని, ఈ ట్రెండ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ డివిడెండు చెల్లింపునకు మే 7 రికార్డుతేదీగా నిర్ణయించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్‌ఈలో 1.8 శాతం తగ్గి రూ.1,477 వద్ద ముగిసింది.