మళ్లీ పెరుగుతున్న బంగారం

27-04-2024 12:15:00 AM

తులం ధర రూ.72,710

హైదరాబాద్, ఏప్రిల్ 26: రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న  బంగారం ధర శుక్రవారం పెరిగింది. ప్రపంచ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా  హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.440 మేర పెరిగి రూ.72,710 వద్దకు చేరింది. వారం రోజుల క్రితం నగరంలో ఈ ధర రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన తర్వాత భారీగా తగ్గిన విషయం విదితమే. తాజాగా  22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.400 పెరిగి రూ.66,650 వద్ద పలుకుతున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర 2,310 డాల ర్ల కనిష్ఠస్థాయి మూడు రోజులుగా క్రమేపీ పెరుగుతూ 2,350 డాలర్లకు పుంజుకున్న కారణంగా స్ఠానికంగా ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. 

వెండి రూ.2000 జంప్

బంగారం ధరతో పోలిస్తే వెండి ధర కాస్త అధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర శుక్రవారం రూ.2,000 తగ్గి రూ.88,000 స్థాయికి చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 27.20 డాలర్ల నుంచి 27.55 డాలర్ల వద్దకు పెరిగింది. 

పెరుగుదలకు కారణమిది..

యూఎస్ జీడీపీ మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గినట్టు వెలువడిన గణాంకాలతో బంగారం ధర తిరిగి పుంజుకు న్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో 3 శాతంపైగా వృద్ధి చెందిన అమెరికా జీడీపీ ఈ మార్చి త్రైమాసికంలో 1.6 శాతానికి పరిమితమయ్యింది. దీంతో ద్రవ్యోల్బణం ఒత్తిడితో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న అంచనాల కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే పుత్తడిలో పెట్టుబడి చేస్తున్నారని గాంధి వివరించారు.