కరిగిన విదేశీ మారక నిల్వలు

27-04-2024 12:10:00 AM

మరో 2.83 బిలియన్ డాలర్లు డౌన్

వరుస రెండు వారాల్లో 8 బిలియన్ డాలర్ల క్షీణత

ముంబై, ఏప్రిల్ 26: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో మరో 2.83 బిలియన్ డాలర్ల మేర తగ్గి 640.33 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం ఏప్రిల్ 12తో ముగిసిన వారంలో ఇవి భారీగా 5.4 బిలియన్ డాలర్లు క్షీణించి 643.16 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ తొలివారంలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత వరుస రెండు వారాల్లో ఇవి 8 బిలియన్ డాలర్లకుపైగా తగ్గాయి. రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.79 బిలియన్ డాలర్ల వరకూ తగ్గి 560.86 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

పెరిగిన బంగారం నిల్వలు

దేశం వద్దనున్న బంగారం నిల్వలు సమీక్షావారంలో 1.01 బిలియన్ డాలర్ల మేర పెరిగి 56.81 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 43 మిలియన్ డాలర్లు తగ్గి 18.03 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 2 మిలియన్ డాలర్లు క్షీణించి 4.63 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 

రూపాయి ఎఫెక్ట్

గత రెండు వారాల్లో విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను మార్కెట్లో విక్రయించడమే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెలలో రూపాయి మారకపు విలువ 83.70 స్థాయికి పతనంకావడంతో ఇది మరింత తగ్గకుండా నిలువరించేక్రమంలో ఆర్బీఐ డాలర్లు విక్రయించినట్టు వారు తెలిపారు. కరెన్సీ మారకపు రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడితే కేంద్ర బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటుంది. పరిస్థితికి అనుగుణంగా ఆ మార్కెట్లో డాలరు లేదా రూపాయి సరఫరాల్ని పెంచడం, తగ్గించడం చేస్తుంది.