18-11-2025 12:56:23 PM
వనపర్తి క్రైమ్: మధుమేహం కారణంగా సంభవించే కంటి చూపు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, "దృష్టి" కార్యక్రమంతో సమగ్ర స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారు నగర్ లో ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో, ఇందిరానగర్ కాలనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న మధుమేహ దృష్టి ఉచిత శిబిరాలను సందర్శించి రెటినోపతి స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మధుమేహ రోగులకు రెటినోపతి స్క్రీనింగ్ కార్యకలాపాల పురోగతిని సమీక్షించి, కంటి చూపు రక్షణలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. మిషన్ మధుమేహ దృష్టి స్క్రీనింగ్‌ను వేగవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడికి పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మధుమేహం ఉన్న రోగులు అందరినీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న శిబిరానికి తీసుకువచ్చే బాధ్యత ఆశ వర్కర్ల పై ఉందని ఆదేశించారు. అందర్నీ శిబిరానికి తీసుకువచ్చి స్క్రీనింగ్ నిర్వహించినప్పుడే కార్యక్రమం లక్ష్యాన్ని సాధించగలమని కలెక్టర్ సూచించారు. స్క్రీనింగ్ కోసం వచ్చే రోగులను ఎక్కువ సేపు వేచి ఉండనీయకుండా త్వరగా స్క్రీనింగ్ పూర్తి చేసి వారికి నివేదిక ఇచ్చి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ నూతన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన వసతిగృహ భవనాన్ని జనవరి 26వ తేదీ లోపు ప్రారంభానికి సిద్ధమయ్యేలా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ సంబంధిత గుత్తేదారుకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.