calender_icon.png 27 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవనశైలితో ఆరోగ్యమస్తు

10-01-2025 12:00:00 AM

ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాగే చిన్న చిన్న మార్పులతోనే ఊహించని ఫలితాలు సాధించవచ్చు. రోజు వ్యాయామం చేయడం, మొబైల్‌కు దూరంగా ఉండటం, సమయానికి భోజనం చేయడం లాంటివన్నీ సాధారణ అలవాట్లే కావచ్చు.. కానీ అవే మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మార్చేస్తాయి. అవేంటో తెలుసుకొని ఈ 2025లో ఆరోగ్యంగా ఉందాం..

మన శరీరం ఎక్కువగా నీటితోనే తయారవుతుంది. శరీర బరువులో సుమారుగా 50 శాతం నుంచి 70 శాతం నీరు ఉంటుంది. అందుకే నీళ్లు లేకుండా 15 రోజులు కూడా ఉండలేరు. శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేయాలంటే నీరు అవసరం. మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికల ద్వారా నీరు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపుతుంది.

నీరు తగినంతగా శరీరానికి అందకపోతే డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటితోనే దినచర్యను ప్రారంభించాలి. అలా రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడమే లక్ష్యంగా పెట్టుకుంటే అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

కదలండి.. కరిగించండి

వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయమాలు చేయడం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం అత్యధిక శాతం మంది కుర్చీలకు అంటి పెట్టుకునే ఉద్యోగాలు చేయడం, పైగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా పాల్గొనాలి. ఈ వ్యాయామాలు ఒత్తిడి లేకుండా కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తాయి. నడక, తేలికపాటి జాగింగ్ కూడా కీళ్ల కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

రెండుస్లారు బ్రషింగ్

జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్రషింగ్ సరిగ్గా చేయనివారు చిగురువాపు, పీరియాంటైటిస్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి ఉదయమే కాదు.. రాత్రిపూట కూడా బ్రషింగ్ చేయాలని చెబుతున్నారు నిపుణులు. 

బ్లూ లైట్ మాయలో పడకండి

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది మొబైల్స్‌తో నిత్యం గడుపుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వలన కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తే రోజంతా చురుగ్గా ఉండొచ్చు. 

మద్యం, ధూమపానం వద్దు

హైలైఫ్ కారణంగా మద్యం తీసుకునేవారిలో మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2025 హానికరమైన అలవాట్లలో మద్యపానం, ధూమపానం ఒకటి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం, మద్యపానం వలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు నిపుణులు. అధిక మ ద్యపానం కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణం. కాలేయ క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

మంచి నిద్ర

శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర చాలా కీలకం. తరచు నిద్రలేమితో బాధపడితే బలహీనమైన రోగనిరోధకశక్తి బాధిస్తుంది. దాంతో మానసిక రుగ్మతలు, ఊబకాయం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతాయి. కాబట్టి రోజుకు ఎనిమిది గంటల నిద్ర పోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.