calender_icon.png 27 January, 2026 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి ఆశలతో కొత్త ప్రయాణం

07-01-2025 12:00:00 AM

కాలంతోనైనా పరుగెత్తాలి.. కాలాన్నైనా పరుగెత్తించాలి. అప్పుడే విజయ తీరాలకు చేరుకోగలం. అయితే కాలం  కొత్త విషయాలను నేర్పిస్తుంది, అనేక సవాళ్లను అధిగమించేలా చేస్తుంది. సంతోషంగా జీవించాలంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం తప్పనిసరి. ఇప్పటికే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఏడాదంతా సంతోషంగా గడిపేందుకు కచ్చితంగా కొన్ని ప్రమాణాలు, తీర్మానాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. 

అన్ని రోజులు ఒకేలా ఉండవు, కొన్ని రోజులు అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంకొన్ని రోజులు సవాలుగా మారతాయి. కానీ అదే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. ఎందుకంటే అన్ని రకాల ఒడిదుడుకులతో నిండిన నిరంతర ప్రయాణమే జీవితం. హెచ్చుతగ్గులు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసినప్పటికీ, మహిళలు మార్పులను కొంచెం ఎక్కువగా అనుభూతి చెందుతారు.

ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించడం, కుటుంబం, ఆఫీసు, లెక్కలేనన్ని ఇతర పనులను చూసుకోవడం కొన్నిసార్లు మానసికంగా బాగా కుంగిపోయేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో జీవితం సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంచి అలవాట్లు, కచ్చితమైన తీర్మానాలతోనే కాలాన్ని జయించగలం.  

ఆర్థిక అడుగులు

కొత్త ఏడాది తొలి రోజు నుంచి ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటానని చాలామంది మహిళలు ప్రతిజ్ఞ చేస్తుంటారు. పరిస్థితులు మారిపోతే ఆచరణలో వెనకడుగు వేస్తుంటారు. చాలా మంది ఆదాయంలోంచి ఎంతోకొంత పొదుపు చేస్తారు. కానీ దాచుకున్న డబ్బును ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలన్న విషయంపై అతి తక్కువ మందికే అవగాహన ఉంటున్నది.

కష్టపడి మిగుల్చుకున్న సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, తదితర మార్గాల్లో మదుపు చేయొచ్చు. రూపాయి మరో రూపాయిని సంపాదించేలా ఆర్థిక వ్యూహాన్ని రచించుకోవాలి. ఉద్యోగినులైతే పన్నుల భారం పడకుండానే మదుపు చేయడంపై దృష్టిపెట్టాలి. 

సంపాదనకు ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు. ఇంటర్నెట్ పుణ్యమా అని ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. పెయింటింగ్స్, కుట్లు, అల్లికలు, హోమ్ చెఫ్, ట్యూషన్స్.. ద్వారా ఎంతోకొంత ఆర్జించే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఓ వరమే. సంపాదన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 

మార్పును స్వాగతించండి

ప్రతిదీ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని గుర్తంచుకోండి. మార్పు అనేది ప్రపంచ నియమం. కాబట్టి మార్పునకు భయపడే బదులు, హుందాతనంతో, పూర్తి విశ్వాసంతో దాన్ని స్వాగతించండి. ఎలాంటి మార్పు అయినా మొదట అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ వ్యక్తిగత ఎదుగుదలకు కొత్త అవకాశంగా భావించి ముందడుగు వేయండి.

తద్వారా సమస్యలకు పరిష్కారం సులభతరమవుతుంది. మార్పును ఆహ్వానించే క్రమంలో ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధార పడటం మానుకోవాలి. కొన్నిసార్లు మీ జీవితం గురించి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే మీకు ఏది మంచిదో మీకు మాత్రమే తెలుసు.  

సంతోషమే సగం బలం

ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగిస్తునే పనికిరాని వాటిని మానేయడం ఉత్తమం. కొత్త అంశాలను పుణికిపుచ్చుకునేందుకు నూతన సంవత్సరం వేదిక ఎందుకు కావాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉండే అలవాట్లకు దూరంగా ఉందాం. కుటుంబ అంశాలకు ప్రాధాన్యం తక్కువైతే ఇప్పటి నుంచే ఆ దిశగా ఆలోచిద్దాం. సమాజానికి పనికొచ్చే ఏదైనా అంశముంటే నలుగురితో పంచుకుందాం. సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగితే ఆనందం వెన్నంటే ఉంటుంది.

నో చెప్పేద్దాం

బాధ్యతలు, అంచనాల కారణంగా మహిళలు తరచుగా భారీ ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా పనిభారం పెరిగిపోయి తమకంటూ సమయం లేకుండా పోతోంది. ఈ ఒత్తిడిని నివారించడానికి ‘నో’ చెప్పడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రాధాన్యతలకు సరిపోని లేదా అనవసరంగా శారీరక, మానసిక శక్తిని హరించే పనిని మర్యాదగా తిరస్కరించడం నేర్చుకోండి. ఈ కొత్త అలవాటు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇది కచ్చితంగా మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.

చిన్నగా మొదలుపెడతాం. 

ఒక తీర్మానం చేసుకుంటాం. ఆ పనిని చిన్నగా మొదలుపెడతాం. కానీ అది అలవాటుగా మారణానికి ఎన్నిరోజులు పడుతుంది? ఎప్పటి వరకు అలా చేస్తూ పోవాలి? అయితే ఒక పని అలవాటుగా మారడానికి కనీసం 21 రోజులు పడుతుంది. అదే పనిని రోజూ క్రమం తప్పకుండా కాసేపు చేస్తే మాత్రం నెల నుంచి రెండు నెలలు పడుతుంది. అలాంటప్పుడు ఒక రెజల్యూషన్ కోసం ఎన్నిరోజులు కష్టపడాలన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే చేస్తున్నది చిన్న పనే కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. టార్గెట్ పెట్టుకోవాల్సిన పని అస్సలు అక్కర్లేదు. 

ఇతరులతో పోల్చుకోవద్దు

ఇతరులతో పోటీపడటం లేదా వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానసిక ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు శ్రమను ఆహ్వానించడం వంటిది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన లక్షణాలతో, వ్యక్తిత్వంతో వేర్వేరు వాతావరణంలో పుడతారు. ఒకే చేతి ఐదు వేళ్లు సమానంగా లేకపోతే జీవితం సమానత్వం ఎలా ఉంటుంది? మన జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చడం మన ఆత్మవిశ్వాసానికి చాలా హానికరం. కాబట్టి ఇలాంటి అలవాటును మానుకుంటే మంచిది.

ఆరోగ్యమే మహా భాగ్యం 

కొత్త ఏడాది నుంచి అయినా మహిళలు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పురుషుడితో పోలిస్తే మహిళ జీవితంలోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఏ సమస్య అయినా హఠాత్తుగా ఊడిపడదు. చిన్నగా మొదలై తీవ్రస్థాయికి చేరుతుంది. పరిస్థితిని మనం అంతదాకా రానివ్వకూడదు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ మొదలైన రుగ్మతలకు సంబంధించి కనీసం ఏడాదికోసారి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

పరీక్ష తర్వాత ఆ నివేదికలను నిపుణులకు చూపించాలి. బిజీ లైఫ్ కారణంగా చాలామంది సరైన ఆహారపు అలవాట్లు పాటించడం లేదని పలు హెల్త్ సర్వేల్లో తేలింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా కచ్చితంగా మంచి ఆహారపు అలవాట్లను ప్రారంభించాలని చెబుతున్నారు నిపుణులు. 

తీర్మానాలు విఫలం కావడానికి కారణాలివే..

కొత్త ఏడాది తీసుకున్న తీర్మానాలు విఫలమవ్వడానికి వాటిని వాయిదా వేయడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు బిర్యానీ తిని, రేపటి నుంచి ఎక్స్సజ్ చేద్దామని ఆలోచనతో వాయిదాల పర్వం మొదలవుతుంది. రోజూ వ్యాయామం చేయాలనే నిబద్ధతతో ఉండటమే కాకుండా దాన్ని రోజూ ఎలా చేయాలనే ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యమని అంటున్నారు. ఏదైనా తీర్మానం చేసుకుంటే మెల్లమెల్లగా ప్రారంభించి.. ఆ తర్వాత వేగం పెంచాలి.